హైదరాబాద్: శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులు నేడు నామినేషన్లు (Nominations) దాఖలు చేయనున్నారు. దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas), కే.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను పార్టీ అధినే కేసీఆర్ (CM KCR) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనమేరకు గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ (Minister KTR), హరీశ్ రావు (Harish rao), ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ సహా పలువురు మంత్రులు, పార్టీ నాయకులు పాల్గొనున్నారు.
ఈ ఏడాదితో శాసనమండలిలో గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ముగినుంచింది. వీరి కోటాలో ఎన్నికకు ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్థానాలకు గురువారం నుంచి మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 14న నామపత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మార్చి 23న ఎన్నికకు పోలింగ్ జరుగనుంది. ఆరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజు ఓట్లు లెక్కించనున్నారు.