హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి తే.. ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి చేతివృత్తులపై ఆధారపడ్డవారి జీవితాలను చీకట్లోకి నెట్టారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. మత్స్యకారులు, నాయీ బ్రహ్మణులు సహా వివిధ చేతివృత్తుల వారికి కేసీఆర్ ప్రోత్సాహకాలు అందిస్తే రేవంత్‌రెడ్డి కోతలు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలసి వివేకానంద మీడియాతో మాట్లాడారు. చేతి వృత్తులవారు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే దుస్థితిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని, ఏం సాధించారని ఏడాది పాలన సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. కుల వృత్తులకు అందాల్సిన ప్రోత్సాహకాలు అందించకపోతే బీఆర్ఎస్ ఆందోళనబాట పడుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ సీనియర్లు చాలామంది కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని కేపీ వివేకానంద తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే విశ్వాసంలేదని విమర్శించారు. రేవంత్‌కు కాంగ్రెస్‌పై పట్టుంటే మంత్రివర్గ విస్తరణ చేసే వారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులపై పోరాటం తప్పదని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానల్లో ఎక్క డా మందులు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని దవాఖానల్లో మంగళవారం పర్యటించానని, ఎక్కడ కూడా బీపీ, షుగర్ గోలీలు లేవని తెలిపారు. ఇందుకేనా కాంగ్రెస్ సంబురాలు చేసుకునేది? అని ప్ర శ్నించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి బస్తీ దవాఖానలను సందర్శించాలని డిమాండ్ చేశారు. ప్రెస్మీట్లో కరెంట్ పోవడంపై కృష్ణారావు భగ్గుమన్నారు. కరెంటు కోతలు కూడా నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, ఎస్టీపీలను కాంగ్రెస్ నేతలు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.