నెత్తురు సలసల మరిగే దృశ్యం. ఏం జరుగుతున్నది తెలంగాణలో..!
ఎవడు తెచ్చిన రాజ్యంలో ఎవడు అధికారం చెలాయిస్తున్నడు?
తెరముందు బొమ్మ ఎవరు? తెర వెనుక నడిపిస్తున్నదెవరు?
ఎవరి దోపిడీ వద్దని స్వరాష్ట్రం తెచ్చుకున్నామో వాళ్లే మన మీద గూండాగిరి. తెలంగాణ గుండెకాయ మీద పట్టపగలు గూండాల స్వైరవిహారం. అధికారం మోకరింపు!
ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి ‘అరగంట అటువైపు వెళ్లకుండా’ ఆదేశాలట! పరాయి గూండాలకు రాచమర్యాదలట. న్యాయం అడిగిన భూమిపుత్రుల ఈడ్చివేతట. గత పదేండ్లలో ఏనాడన్నా ఇలాంటి దృశ్యాలు చూశామా? ఇక్కడ భూమిపుత్రుడి మీద చెయ్యెత్తినోడున్నడా? తెలంగాణ మీద నోరెత్తినోడున్నడా? సాక్షాత్త్తు ఎమ్మెల్యే అయిన తెలంగాణ బిడ్డ మీద బూతు పురాణమా? ఏకంగా ఇంటి మీద దాడికి తెగింపా?
ఎవరిచ్చిన అలుసు? ఎవరు రాసిన స్క్రిప్టు? ఎటు పోతున్నం? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదా? ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం నడుస్తున్నదా? ఇమేజ్ పెంచడానికి పీఆర్ స్టంట్లు. విపక్షాలను అణచివేయడానికి దాడులు! నల్లగొండలో దాడి.. ఖమ్మంలో దాడి.. సిద్దిపేటలో దాడి. ఇప్పుడు హైదరాబాద్‌లో దాడి.. ప్రతిపక్షాన్ని భయపెట్టి నోరు మూయించే యత్నం. దాడులతో భీతావహులను చేసే కుట్ర. ఎవరు చురుగ్గా ఉంటే వారిని టార్గెట్ చేసే ఫ్యాక్షన్ రాజకీయం ఇపుడు తెలంగాణలో అమలు చేస్తున్నట్టున్నది. ..కానీ మహామహా పర్వతాలనే ఢీ కొట్టిన ఉద్యమ పార్టీకి ఈ పిపీలికాలు, పీఆర్గాళ్లు ఓ లెక్కా?
Congress | హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గుండెపై కిరాయి గూండాల దాడి! పరాయినోళ్ల నుంచి పచ్చిబూతులు! హుజూరాబాద్ గడ్డపై పుట్టినోడు లోకల్ కాదట. ఎక్కడినుంచో వచ్చినోళ్లు స్థానికులట! హైదరాబాద్ వాళ్ల ఏరియానట! ప్రశ్నిస్తే ఇక్కడ తిరగనివ్వరట! తెలంగాణ నడిబొడ్డున సాగిన రౌడీరాజ్యంలో వినిపించిన మాటలివి! ఎక్కడినుంచి వచ్చిందా ధైర్యం? ఎవరి అండ చూసుకుని ఆ వీరంగం? పదేండ్లు కనపడని మూకలు.. మళ్లీ తోక జాడిస్తున్నయ్ ఎందుకు?
ఒక ఎమ్మెల్యే ఇంటిపైనే దాడికి తెగబడేంత అలుసు ఎవరిచ్చారు? అడిగితే కేసులు.. నిలదీస్తే దాడులు.. ఆందోళనకు దిగితే అరెస్టులు! తెలంగాణలో ఇప్పుడిదే ప్రభుత్వ విధానం! పార్టీ మారనేలేదన్న అరికెపూడి గాంధీకి.. మరి అలాంటప్పుడు గులాబీ కండువా కప్పుకోమనడం తప్పుగా తోచింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ కాంగ్రెస్ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. అసలే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ వేసిన కౌశిక్‌పై పీకలదాక ఉన్న కోపం.. పీఏసీ పదవితో బయటపడింది.
మొదట హౌస్ అరెస్టు అంటూ బలగాలను దింపి కౌశిక్‌ను ఇంటికే పరిమితం చేశారు. కొద్దిగంటల్లోనే పోలీసులను తగ్గించి.. దాడికి రంగం సిద్ధంచేశారు. కూకట్పల్లి నుంచి కొండాపూర్ దాక 9 కిలోమీటర్లు మందీమార్బలంతో అరికెపూడి బయల్దేరినా పోలీసులు చూడనట్టే ఉండిపోయారు. వరుస వాహనాలతో ఫ్యాక్షన్ లీడర్ తరహాలో కాన్వాయ్ బయల్దేరితే.. అదేదో దండయాత్రలా కాకుండా ‘గాంధీ- దండి యాత్ర’లానే పోలీసులు చూస్తుండిపోయారు. చివరకు పాడి ఇంటిమీద రాళ్లదాడి జరుగుతున్నా పట్టనట్టే వ్యవహరించారు. తరుచూ రాజ్యాంగం చేతపట్టుకుని ప్రజాస్వామ్య విలువలు ప్రబోధిస్తూ కనిపిస్తున్న కాంగ్రెస్ అధినాయకుడిని, నేతలను కలిసేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ఇక్కడ ఎమ్మెల్యేపై దాడి జరిగింది!
ఎవరి ఆదేశాల మేరకు?
చివరికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడూ బీఆర్ఎస్ నేతలపై అరాచకకాండ కొనసాగింది. సైబరాబాద్ కమిషనరేట్లోకి వెళ్లకుండా పోలీసులే అడ్డగించారు. హరీశ్ సహా మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నా లోనికి అనుమతించలేదు. దీంతో నేతలంతా అక్కడే మెట్లపై బైఠాయించారు. అరికెపూడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని నినదించారు. రెండు గంటలపాటు ఆందోళన కొనసాగుతున్నా ఉన్నతాధికారులను కలిసేందుకు అనుమతించలేదు.
అధికారులూ అక్కడికి వచ్చి వారికి హామీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చివరకు వాళ్లందరినీ ఈడ్చుకెళ్లి వాహనాల్లో బయటకు తీసుకెళ్లారు. రెండు బస్సుల్లో వేర్వేరు రూట్లలో తీసుకెళ్తూ.. మూడు గంటలపాటు రోడ్లపైనే తిప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్తున్నారన్న సమాచారంతో తెలంగాణవాదులు, బీఆర్ఎస్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేశంపేట, తలకొండపల్లిల్లో వందలాదిమంది స్థానికులు అడ్డుకోవడంతో పోలీసు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను కదలనివ్వని జనం.. వాటి టైర్లకు నిప్పుపెట్టారు. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జికి దిగారు. ‘సీఎం డౌన్ డౌన్..’ ‘రేవంతరెడ్డీ ఖబర్ద్దార్’ అన్న నినాదాల మధ్య.. బీఆర్ఎస్ నేతలను కేశంపేట స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్‌లో అరెస్టు చేసిన నాయకులను రంగారెడ్డి జిల్లాలోని మారుమూల ఠాణాకు తీసుకెళ్లడం వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయి? గాంధీని అరెస్టు చేసి నార్సింగి స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. స్టేషన్ బెయిల్ ఇచ్చి ‘మర్యాదగా’ ఇంటికి పంపారు. దాడిపై చర్యలు తీసుకోవాలన్న బీఆర్ఎస్ నాయకులను జిల్లాలు తిప్పుతూ తీసుకెళ్లారు. పోలీసుల దురుసు ప్రవర్తనలో హరీశ్ సహా పలువురు నేతలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటుతుండటం, ప్రతిఘటన తీవ్రమవుతుండటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. బీఆర్ఎస్ నేతలను బేషరతుగా విడుదల చేశారు.