కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. మొత్తం 19 అంశాలపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రం అవినీతి కుంభకోనాలకు కేంద్రంగా మారిపోయిన దుస్థితి నెలకొందని లేఖలో ఎమ్మెల్యేలు తెలిపారు. లెక్కకు మించిన కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటం మాత్రమే కాకుండా.. స్వయంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయని అన్నారు. రెండున్నరేళ్ల పాలనా వ్యవధిలో ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా ఛిద్రమయ్యేలా చేసిన ఘనత మీ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.
దాదాపు అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతుందని అన్నారు. వాటిని అడ్డుకునే బాధ్యత వహించిన వారే ఈ దోపిడీకి మూలస్తంభంగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. బాధ్యత వహించాల్సిన మంత్రులే కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం ఉన్నారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ మాత్రమే కాదు అవమానం కూడా అని విమర్శించారు.
ఈ కుంభకోణాల ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోతుండగా.. సామాన్య ప్రజలకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన పారదర్శకత, బాధ్యతాయుత పాలన అనే హామీలు నీటి మూటలుగా మారిపోయాయని పేర్కొన్నారు. మాటల్లో నీతి వాక్యాలు.. చేతల్లో దోపిడీ.. ఇదే మీ పాలనకు ప్రతీకగా మారిందని అన్నారు. అవినీతిని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయం కుండబద్ధలు కొట్టినట్లుగా స్పష్టమైందనన్నారు. ఈ పాలన నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే.. ఇది నిర్లక్ష్యమా? లేక మీ ప్రోత్సాహమా అన్న అనుమానం ప్రజల్లో మరింత బలపడుతోందని తెలిపారు.
అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరుపుతామని శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించారు.. కాబట్టి మీ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలను అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. మీ మాటపై మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ కుంభకోణాల్లో ప్రమేయం ఉన్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని రికవరీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
1. సివిల్ సప్లై స్కాం
2. అమృత్ టెండర్ల స్కాం
3. కేఎల్ఎస్ఆర్ స్కాం
4. నైనీ కోల్ బ్లాక్ – సింగరేణి స్కాం
5. సింగరేణి ఓబీ స్కాం
6. సోలార్ పవర్ స్కాం
7.ఎన్టీపీసీ ఓబీ స్కాం
8.హెచ్సీయూ భూముల స్కాం
9.లగచర్ల ల్యాండ్ స్కాం
10.కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా స్కాం
11. ఎక్సైజ్ మెట్రో బ్రూవరీ స్కాం
12. హోమ్ రోడ్స్ స్కాం
13. టీడీఆర్ స్కాం
14. యంగ్ ఇండియా స్కూల్స్ స్కాం
15. ఫోర్త్ సిటీ స్కాం
16. హిల్టీపీ స్కాం
17. అక్రమ మైనింగ్ స్కాం
18. డెక్కన్ సిమెంట్స్ స్కాం
19. మంచి రేవుల దేవాదాయ భూముల స్కాం