హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపునకు పాల్పడి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద చెప్పారు. ఆ పది స్థానాల్లో మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని వారు బుధవారం అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు అందించారు. అనంతరం వారిద్దరూ తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు హైకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు వస్తాయన్న భయంతో గజగజ వణుకుతున్నారని కౌశిక్‌రెడ్డి చెప్పారు.
పూటకో పార్టీ మారే దానం నాగేందర్ శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడని, పొద్దున కేసీఆర్ దగ్గర ఎన్నికల ఖర్చుకు డబ్బు తీసుకుని వెళ్లి సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోలేదంటూ మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలందరూ స్పీకర్ నిర్ణయం కోసం ఆగకుండా తమ పదవులకు రాజీనామాచేసి ఉప ఎన్నికలు ఎదుర్కోవాలని సవాల్ చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ గత పదేండ్లలో సింగిల్‌గా ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కండువా కప్పలేదని, అలా చేర్చుకున్నట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో సీఎల్పీని బీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారని గుర్తుచేశారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడైతే తెలంగాణ భవన్‌కు రావాలని సూచించారు.
ఆ ఏడుగురు పై పిటిషన్ పెండింగ్‌లో ఉంది: వివేకానంద
కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మరో ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తాము ఇచ్చిన పిటిషన్ స్పీకర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కాలయాపన చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. పీఏసీ చైర్మన్ విషయంలో ఏ నిబంధనలు పాటించారో శ్రీధర్‌బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పీఏసీకి 14 మంది నామినేషన్ వేస్తే ఎన్నికలు నిర్వహించకుండా.. అరికెపూడి గాంధీతో దొంగచాటుగా నామినేషన్ వేయించి ఎంపిక చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని, తడిబట్టతో వారి గొంతు కోశారని విమర్శించారు. ఆ పది మంది భవిష్యత్తుకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు తర్వాత ఆ ఎమ్మెల్యేలు ఆగమాగం అవుతున్నారని చెప్పారు. హైకోర్టు తీర్పుపై కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చామని వారు తెలిపారు.