హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ( Telangana Assembly) ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేయడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Prashant Reddy) , ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తప్పుపట్టారు. అసెంబ్లీని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం చరిత్ర లేదని,దీనిని శాసనసభా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతున్న దృష్ట్యా సమావేశాన్ని వాయిదా(Adjourn) వేయడం పట్ల బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా పాయింట్వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభా ప్రొసిజర్స్ను (Legislative Procedures) తుంగలో తొక్కి శాసనసభను అవమానించే విధంగా వ్యవహరిస్తుందని మండి పడ్డారు. కీలకమైన అంశాలు అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు ముందుగానే మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటారని అన్నారు. అలా కాకుండా అసెంబ్లీ సమావేశం ఉందనగా గంట ముందు మంత్రి వర్గ సమావేశం పెట్టుకోవడం శోచనీయమని అన్నారు.
బీసీ (BC) , ఎస్సీ (SC) వర్గీకరణ అంశాలు రెండు కూడా ఒకేరోజు పెట్టుకోవాలని ఆత్రుత ఎందుకని పేర్కొన్నారు. ఎవరిని మభ్య పెట్టేందుకు సమావేశం వాయిదా వేశారని ఆరోపించారు. కాంగ్రెస్కు బీసీ, ఎస్సీల మీద చిత్తశుద్ధి ఉన్నట్లా , లేనట్లా? అని ప్రశ్నించారు. అసెంబ్లీని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం చరిత్ర లేదని,దీనిని శాసనసభా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు అన్నారు.
అసెంబ్లీ సంప్రదాయాలను, ప్రొసిజర్స్ను పాటించకుండా ప్రభుత్వం తెలంగాణ రాష్టాన్ని, శాసనసభ పరువును తీసేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీ,ఎస్సీ వర్గీకరణపై చర్చకు ఆహ్వానించి సమావేశాన్ని వాయిదా వేయడం బీసీలకు,శాసనసభ్యులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు.