Sabitha Indra Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం ముగ్గురం మహిళా ఎమ్మెల్యేలం సభలో నిల్చొని ఉంటే.. అయ్యో పాపం అనాల్సింది పోయి.. కాంగ్రెస్ సభ్యుల ముఖాల్లో రాక్షసానందం కనిపించిందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలులు సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మితో కలిసి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, సోనియా నాయకత్వం అని ఊదరగోడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రజా పాలన అంటే ఎలా ఉంటుందో మార్పు తీసుకొస్తారన్న నమ్మకంతో ఆడబిడ్డలందరూ కాంగ్రెస్కు ఓటేశారు. గ్యాస్ సబ్సిడీ, మహిళలకు నెలకు రూ. 2500 వంటి హామీలకు ఆడబిడ్డలు ఆకర్షితులై గెలిపించారు. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది.. రోజు ఉదయం లేస్తే ఏ టీవీలో ఏం వార్త కనిపిస్తుందో, ఏ పేపర్లో ఏ వార్త చదవాల్సి వస్తుందో అని అమ్మాయిల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలపై మొన్న అసెంబ్లీలో మాట్లాడిన 48 గంటల్లోపే హైదరాబాద్ నగరంలో ఐదుగురిపై అత్యాచారం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేదు అని సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
అత్యాచార ఘటనలపై మాట్లాడుదామని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అంటే నాలుగున్నర గంటలు నిలిచి ఉంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకు ముఖ్యమంత్రికి భయం. ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవం మాత్రమే మాట్లాడుతారు. తిమ్మినిబమ్మిని చేసే శక్తి మాకు లేదు. కనీసం మైక్ ఇవ్వలేదు. సీఎంగా రేవంత్ ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటల పాటు నిలబడి ఉంటే కూడా మైక్ ఇవ్వలేదనే మాట చరిత్రలో ఉండిపోతుంది. ఆ సీటు వైపు చూస్తుంటే.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ గుర్తుకు వచ్చారు. ఇవాళ వీరందరూ కనిపించారు. ఆడబిడ్డలు నిల్చున్నారు వారికి అవకాశం ఇవ్వండి అని వారు అనేవారు. మిగతావి తర్వాత మాట్లాడుదాం అనేవారు. కానీ ఇవాళ మేం నిల్చుంటే కాంగ్రెస్ సభ్యుల ముఖాల్లో రాక్షసానందం కనిపించింది. ఆశ్చర్యమేసింది. ఒక్కరు కూడా అవమానంగా ఫీల్ కాలేదు.. వారి రాక్షసానందం చూస్తే బాధ అనిపించింది అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో రెండురోజులు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
BRS MLA’s Arrest | మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలపై నిరసన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..