హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో శుక్రవారం ఆమోదించిన చట్టం భూ భారతి కాదని, అది భూ హారతని, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవాచేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడుతూ ధరణిలో ఉన్న లోపాలను సవరించకుండా తీసుకొచ్చిన కొత్త చట్టంతో రాష్ట్రంలోని 75 లక్షల మంది రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు. ధరణి వల్ల కోటీ 50 లక్షల ఎకరాలకు హకులు దక్కాయని తెలిపారు. అలాంటి రైతుల పాలిట భూ భారతి చట్టం పిడుగులాంటిదన్నారు. కేవలం పది శాతం సమస్యలు కూడా లేని ధరణిని రద్దు చేయడం దారుణమని, ధరణితో పారదర్శకత పెరిగిందని, 12 కోట్ల మంది ధరణి వెబ్‌సైట్‌ను విజిట్ చేశారని, లక్షల లావాదేవీలు జరిగాయని, రిజిస్ట్రేషన్ ఫీజు కింద కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయని చెప్పారు.
ప్రతి దశలోనూ లొసుగులు
భూ భారతిపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి పచ్చి అబద్ధాలు ఆడారని పల్లా మండిపడ్డారు. నిజాం తర్వాత తెలంగాణలో భూమినంతా 86 సంవత్సరాల తర్వాత కేసీఆర్ సర్వే (ఎల్‌ఆర్‌యూపీ) చేయించి హకు పత్రాలు ఇచ్చారని గుర్తుచేశారు. సీఎంవోలో ఉన్న అధికారులంతా ధరణి చట్టంలో పాలుపంచుకున్నవారేనని, వారిని కూడా రేవంత్ తప్పబడుతున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెచ్చిన సాఫ్ట్‌వేర్‌ను వాడుతూ రేవంత్ గత ప్రభుత్వాన్ని తప్పు పట్టడం విడ్డూరమన్నారు. విదేశీ సంస్థల చేతిలో ధరణి సాఫ్ట్వేర్ అనేది పూర్తి అబద్ధమని చెప్పారు. భూ భారతిలో జమాబందీని తిరిగి తెస్తున్నారని, దీని ద్వారా అక్రమారులకు పండుగేనని చెప్పారు. ఫౌతీ విధానం తేవడం తిరోగమన చర్యగా తాము భావిస్తున్నామని, దీని వల్ల కుటుంబంలో మళ్లీ తగాదాలు మొదలవుతాయని తెలిపా రు. అనుభవదారు కాలమ్‌తో రైతు, కౌలు రైతులు ఇక నిత్యం కొట్లాడాల్సి వస్తుందని వాపోయారు. కొత్త దుకాణాలు మొదలై అవినీతి విచ్చలవిడి అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మార్వో సంతృప్తి చెందితేనే మ్యూటేషన్ అనేది మరో అవినీతి దుకాణమని చెప్పారు. ధరణిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోయేదని, భూ భారతి చట్టాన్ని తాము తిరసరిస్తున్నామని తెలిపారు. భూ భారతిపై రైతులతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. పల్లా వెంట ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, కేవీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్, విజయుడు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.