Palla Rajeshwar Reddy : ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీపై అబద్ధాలు చెబుతోందని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. అక్కడ 100 శాతం రుణమాఫీ చేసినం, ఇక్కడ 100 శాతం రుణమాఫీ చేసినం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని, తన జనగామ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా 100 శాతం రుణమాఫీ కాలేదని చెప్పారు. తన నియోజకవర్గంలో మొత్తం 127 గ్రామాలు ఉన్నాయని, ఆ 127 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో 100 శాతం రుణమాఫీ కాలేదని అన్నారు.
తన నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో అయినా సరే 100 శాతం రుణమాఫీ జరిగినట్లుగా ప్రభుత్వం నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని పల్లా రాజేశ్వర్రెడ్డి శపథం చేశారు. అంతేకాదు తాను తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. వంద శాతం రుణమాఫీ చేశామని అబద్ధాలు చెప్పకుండా.. ఇంకా రుణాలు మాఫీ కాని రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా విద్యాశాఖలో డ్రాపౌట్స్ పెరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో 2 లక్షల డ్రాపౌట్స్ నమోదయ్యాయని చెప్పారు. విద్యాసంస్థలకు నిధుల కేటాయింపులో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు.