హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు, హామీల అమలుపై నిలదీస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి తనను చంపాలని ప్రయత్నిస్తున్నాడని, అందుకే తన ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తానే చేశానని, ఇప్పుడు రేవంత్ సీఎం పదవి నుంచి దిగిపోయేదాకా నిద్రపోను అని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా విశ్రమించకుండా పనిచేస్తానని ప్రకటించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా రేవంత్‌రెడ్డి గుండెల్లో నిద్రపోతానని తెలిపారు. తనకు ఏదైనా జరిగితే రేవంత్‌రెడ్డే బాధ్యుడని, తనను చంపేందుకు యత్నించిన రేవంత్‌రెడ్డిపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాలని డీజీపీ, సీపీని డిమాండ్ చేశారు. లేకుంటే గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన ఇంటిపై దాడికి వెళ్లింది తమవాళ్లేనని సీఎం ఒప్పుకొన్నారని, స్వయంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపించానని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
తనను ఎందుకు హత్య చేయాలని అనుకుంటున్నారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యలపై, కాంగ్రెస్ హామీలపై నిలదీస్తున్నందుకు తనను హత్య చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపైకి తమ వాళ్లే వెళ్లారని సీఎం చెప్పినా డీజీపీ, హోం సెక్రటరీ ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే సైబరాబాద్ సీపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
నెక్నాంపూర్ వాసవి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని వేసెల్లా విల్లాస్ శివానందరెడ్డి అనే బిల్డర్‌ను బెదిరించి రేవంత్‌రెడ్డి తన సోదరుడు తిరుపతిరెడ్డికి ఫ్లాట్ ఇప్పించాడని, ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో ఇల్లు కూలగొడతానని తన సోదరుడికి చెప్పి నోటీసులతో సరిపెట్టారని గుర్తుచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ దగ్గర రూ.25 కోట్లు తీసుకొని ఈటెల గెలుపు కోసం సహకరించారని, అందుకే తాను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరానని తెలిపారు.
రేవంత్‌రెడ్డి దిగజారుడు మాటలను బంద్ చేయాలని, ఆయన పొద్దునోమాట, రాత్రోమాట మాట్లాడుతున్నాని ఎమ్మెల్యే డాక్టర్ కే సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఢిల్లీలో గాంధీ బీఆర్ఎస్ అని చెప్పి, హైదరాబాద్ రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారన్నారు. రాజకీయమంటే తిట్టాలి, కొట్టాలి అనే విధంగా తయారైందని, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామా అని రోజూ బాధపడుతున్నామని చెప్పారు.
రేవంత్‌రెడ్డి ఎప్పటికీ కేసీఆర్ అంత గొప్పోడు కాలేడని చెప్పారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎటు కాకుండా పోయారన్నారు.దానం నాగేందర్, అరికెపూడి గాంధీ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన దానం నాగేందర్, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్పైనే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు.
ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి సంకుచిత మనస్తత్వంతో మాట్లాడి తన దీనస్థితిని బయటపెట్టుకున్నారని విమర్శించారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు అభద్రతాభావంలో ఉన్నారని చెప్పారు. పది మంది ఎమ్మెల్యేలపై చర్యల కోసం స్పీకర్‌ను కోరితే తమకు సమాధానం చెప్పలేక కౌశిక్‌రెడ్డి ఇంటిపైకి అరికెపూడి గాంధీని ఉసిగొల్పారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆటవిక, అరాచక పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.