హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎ న్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఓట్ చోరీకి పాల్పడ్డారని, బీజేపీకి ఓట్లు వేయించారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో సంబంధాలు పెట్టుకున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీల ఓట్లను బీజేపీకి అమ్ముకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 8మంది కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడేలా చక్రం తిప్పిన తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీలైన కొందరు మిత్రులే తనతో చెప్పారని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి 315 ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటిస్తే, ఎన్నికల కమిషన్ మాత్రం 300 ఓట్లు మాత్రమే వచ్చాయని ప్రకటించిందని గుర్తుచేశారు. మరి ఆ 15మంది ఓట్లు ఎవరికి పడ్డాయని అనుమా నం వ్యక్తంచేశారు. కూటమి తరఫున ఎన్నికల బరిలోకి దిగిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అనంతరం కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, స్పీకర్‌ను కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చెప్పడంతోనే ఓట్లు వేయించారని పేర్కొన్నారు.
గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ కోరడం లేదెందుకు?
రేవంత్‌రెడ్డి గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ వారిని చూస్తుంటే జాలేస్తుందని, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రా? లేదంటే బీజేపీ ముఖ్యమంత్రా? అన్న విషయం వాళ్లకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీసీల జపం చేసే సీఎం, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు.