Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలతోనే తమ పంచాయితీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తనను కూడా డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మీద కూడా ఇదే కుట్ర చేసి విఫలమయ్యారని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్తో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్టుకు రావాలని సవాలు విసిరారు. మా ఎమ్మెల్యే అందరూ వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు మమ్మల్ని పిలవలేదు.. మేం డబ్బాలు పట్టుకుని రెడీగా ఉన్నామని తెలిపారు.
కేసీఆర్ పేరు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పేరు తలచుకోకుండా నీ ఒక్క మీటింగ్ అన్నా అయ్యిందా అని ప్రశ్నించారు ఎవడో పెయింటర్ గోడల మీద రాసింది తుడిపేస్తే చెరిగేపోయే పేరు కాదని అన్నారు. తెలంగాణ ప్రజల గుండెలకు అతుక్కుపోయిన పేరు కేసీఆర్ అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక గొప్ప అవకాశం వచ్చిందని అన్నారు. దాన్ని వినియోగించుకుని ప్రజలకు మంచి చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
దేశంలోనే రైతులకు రూ.2లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక సీఎం కేసీఆర్ అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. పదేళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఇలాంటి ముఖ్యమంత్రి లేడు అని విమర్శించారు.