హైదరాబాద్, ఏప్రిల్23 (నమస్తే తెలంగాణ): ఏపీకి చెందిన అగ్నికుల క్షత్రియ ఉపకులాల జాబితాలో గంగపుత్ర, బెస్తలను చూపడం సమంజసం కాదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గంగపుత్రులను తల్వార్ గుర్తింపునివ్వడం హేయమని మండిపడ్డారు. వెంటనే లోపాలని సవరించేలా చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ను కోరారు. గురువారం ఖైరతాబాద్ కార్యాలయంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను గంగపుత్ర, బెస్త, గూండ్ల కుల ప్రతినిధులతో గోపాల్ కలిశారు.
కులగణనకు సంబంధించి స్వతంత్ర నిపుణుల కమిటీ అధ్యాయనం చేసి సమర్పించిన నివేదికలోని పలు అంశాలపై కమిషన్కు ఫిర్యాదు చేశారు. బీసీ కమిషనర్లు రాపోలు జయప్రకాష్, బాల లక్ష్మి, రాష్ట్ర గంగపుత్ర సంఘాల ప్రతినిధులు డాక్టర్ దేశబోయిన రమాదేవి, ఆర్కే ప్రసాద్, ప్రొఫెసర్ సుదర్శన్, దీటి రామచందర్, అడ్వకేట్ మల్లేశం, చేరక సత్యనారాయణ, కాయా హనుమంతు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.