హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనసభలో ప్రశ్నించేవారి గొంతునొక్కేందుకే సర్కార్ బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ విధించిందని ఎమ్మెల్యే కే మాణిక్‌రావు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా ఉండేందుకే సీఎం రేవంత్ పోలీసు బలగాలతో విపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. మూడు రోజుల పాటు సభా సమయాన్ని వృథా చేసింది పాలకపక్షమేనని మండిపడ్డారు. కేసీఆర్ ఇంటిపై దాడి చేసే హక్కు కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారని, దళిత కార్డు వాడుకుంటూ బీఆర్ఎస్పై బురదజల్లుతున్నారని విమర్శించారు. సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉన్నదని చెప్పారు.
కౌరవ సభగా అసెంబ్లీ: మెతుకు ఆనంద్
బీఏసీ ఎజెండా ప్రకారం శాసనసభను నిర్వహించకుండా రేవంత్ సర్కార్ కౌరవ సభను నిర్వహిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మండిపడ్డారు. స్పీకర్‌కు ఎనలేని గౌరవం ఇస్తామని, కాంగ్రెస్ పార్టీయే ఆ స్థానాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నదని స్పష్టంచేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి పసుపు నీళ్లపై సభలో అర్థం లేని చర్చలు జరుపడమేందని ప్రశ్నించారు. కేసీఆర్‌పై చావు డప్పు కొట్టాలంటూ సీఎం డైరెక్షన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విర్రవీగడం దారుణమని దుయ్యబట్టారు.
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ స్పీకర్‌ను పదేపదే దళితుడని సంబోధిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కించపరుస్తున్నారని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులను చదువుకు దూరం చేసి వారి చేతుల్లో చావు డప్పులు పెడుతున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ నివాసంపై దాడికి యత్నించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో దళితుల సంక్షేమానికి కేటాయించిన నిధులపై చర్చకు సిద్ధమా అని ఎర్రోళ్ల సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో దళితుల కోసం రూ.96 వేల కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ నామమాత్రపు నిధులతో కాలం గడుపుతున్నదని వివరించారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్ పాల్గొన్నారు.