KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బయట మాట్లాడుతూ.. ఎంతసేపు చాయ్ తాగే లోపు అయిపోతాయని మాట్లాడుతుంటారు.. ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాహుల్, మోదీ చాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర గంటలో బీసీ రిజర్వేషన్ల అంశం ఒడిసిపోతది, బిల్లు పాస్ అయిపోతది. రాజ్యాంగ సవరణ జరిగిపోతది. పది రోజులు హౌజ్ నడిపినా.. ఇది అయ్యేది కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ సభలో మాట్లాడారు.
మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి, ఇప్పుడు తెస్తున్నబిల్లుకు తేడా ఏంది..? ఆర్డినెన్స్ మీద సంతకం చేయని గవర్నర్.. ఈ బిల్లుపై ఎలా సంతకం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్లొద్ద అనడం సరికాదు. ప్రభుత్వాలు చట్టాలకు తూట్లు పొడిస్తే, లోబడి పని చేయకపోతే జ్యుడిషియల్ రివ్యూ ఉంటది. ఆ విషయం మంత్రులు గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు.
బీసీ ధర్నాకు మేం రాలేదు ఓకే. మరి రాహుల్, ఖర్గే ఎందుకు రాలేదు. ఇది డ్రామా అని వారు కూడా అనుకున్నారా..? డిక్లరేషన్లు కాదు డెడికేషన్ కావాలి. మీరు కన్ఫ్యూజ్ అయి అందర్నీ కన్ఫ్యూజ్ చేయొద్దు. ప్రజలను గందరగోళ పరచకండి. ప్రధాని అపాయింట్మెంట్ ఎమ్మెల్యే ఇప్పిస్తాడా..? ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ అడగాలి. తప్పకుండా ఇస్తారు. సీఎం రేవంత్ రెడ్డి 20 నెలల కాలంలో 52 సార్లు ఢిల్లీకి పోయారు. ఈ సమస్య తేలాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి.. మేం కూడా వస్తాం. ఇక రెండోది డెడికేషన్ ఉండాలి. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లు సాధించుడో.. ఢిల్లీ నుంచి తిరిగి రాను అని చెప్పి జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేయమనండి.. మేం వద్దంటున్నామా..? అని కేటీఆర్ అన్నారు.