KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లపై సీలింగ్ విధించారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం శుద్ధ తప్పు.. అది 100 శాతం అబద్ధం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ శాసనసభలో ప్రసంగించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో లొసుగులు లేకుండా చట్టాలు సరిగ్గా చేస్తే న్యాయ వ్యస్థ అడ్డు రాదు. శాస్త్రీయంగా చేయాలని అడుగుతున్నాం. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో మద్దతు తెలుపుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు. మంత్రిని తప్పుదోవ పట్టించకండి.. అని అధికారులకు సూచిస్తున్నాం. సీలింగ్ విధించారన్నది శుద్ధ తప్పు. అది 100 శాతం అబద్ధం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆర్టికల్ 243డీ6, టీ6 ద్వారా బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలకే ఇచ్చుకోవచ్చని ఆదేశాలు వచ్చాయి. దాన్ని అనుసరించి కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాం. రిజర్వేషన్లు కల్పించుకున్నాం. 396 జీవో ద్వారా 34 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం 396 జీవో ఇస్తే.. వెంటనే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు పోయి అడ్డుకున్నారు. గోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహిత బంధువు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్లే ఇది జరిగింది. సీఎం రాజకీయపరమైన అంశాలు మాట్లాడకపోతే మేం కూడా మాట్లాడం. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెబుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
15 రోజులు సభ నడపకుండా ప్రభుత్వం పారిపోతుంది. అన్ని సమస్యలపై చర్చిద్దాం అంటే రేవంత్ సర్కార్ ముందుకు రావడం లేదు. బీహార్లో ఉన్న కొన్ని పత్రికల్లో ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలు చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అయిపోయాయని. తెలంగాణ ప్రజల డబ్బు బీహార్లో ఖర్చు పెడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే న్యాయ సమీక్షకు నిలబడని జీవోలతో బీసీల జీవితాలు ఎలా మారుస్తారో చెప్పాలి. పార్లమెంట్లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్ల లాభం జరుగుతుందో చెప్పాలి. ఐదు రకాలుగా మాట్లాడితే దేని ద్వారా సాధ్యమవుతుంది. ఇక్కడ ఎలాగూ బిల్లు పాస్ అవుతది. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ ఈ బిల్లు మీద సంతకం ఎలా పెడుతారు.. దయచేసి ప్రభుత్వం చెప్పాలి. ఎవర్నీ మోసం చేయడానికి ఇదంతా అని కేటీఆర్ నిలదీశారు.