వరంగల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపుల పరంపర కొనసాగుతున్నది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని శనివారం మరోసారి అరెస్ట్ చేసింది. విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనను అదుపులోకి తీసుకుంది. హనుమకొండకు చెందిన గ్రానైట్ వ్యాపారి కట్టా మనోజ్‌రెడ్డిని బెదిరించినట్టుగా ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హనుమకొండలోని సుబేదారి స్టేషన్లో ఏప్రిల్ 22న నమోదైంది. ఇదే కేసును సాకుగా చూపుతూ పోలీసులు కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని హనుమకొండకు తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుబేదారి పోలీసు స్టేషన్లోనే ఉంచారు. బీఎన్ఎస్లోని 308(2), 308(4), 308(5), 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మధ్యాహ్నం తర్వాత వరంగల్‌లోని ఎంజీఎంలో కౌశిక్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం కోర్టుకు తీసుకెళ్లారు. అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఇన్చార్జిగా ఉన్న కాజీపేట రైల్వే కోర్టు జడ్జి నాగలీల సుశ్మిత ఎదుట కౌశిక్‌రెడ్డిని హాజరు పరుచగా, ఆమె బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.
హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం వంగపల్లిలో ఉన్న క్వారీని హనుమకొండకు చెందిన మనోజ్‌రెడ్డి నిర్వహిస్తున్నాడు. రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బెదిరించారని మనోజ్‌రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు చేయడంతో సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన అరెస్టుపై హైకోర్టు స్టే విధించింది. అయితే ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జూన్ 16న హైకోర్టు తిరస్కరించింది. విచారణను ఎదుర్కోవాలని ఆదేశించింది. శనివారం ఆయనను అరెస్టు చేసి అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ అక్రమ కేసుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. తొలుత పిటిషన్లో బీఎన్ఎస్లోని 308(2), 308(4), 352 సెక్షన్ల నమోదు ప్రకారం విచారణ చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారని, తాజాగా 308(5) సెక్షన్‌ను అదనంగా జత చేశారని పేర్కొన్నారు.
కౌశిక్‌రెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి, ఇతర నేతలు వచ్చారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్‌ను కలిశారు. ఎఫ్ఐఆర్లో మొదట పేర్కొన్న సెక్షన్లను మార్చారని వివరించారు. పాడి కౌశిక్‌రెడ్డి సతీమణి శాలినిరెడ్డి, సోదరుడు ప్రతీక్‌రెడ్డిని కలిశారు. అంతకముందు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దా స్యం వినయభాస్కర్ పోలీసుస్టేషన్లో ఉన్న కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు వెళ్లడంతో పోలీసులు అనుమతించలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు వినయభాస్కర్కు పోలీసులు అనుమతి ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించడంతో పాటు బారికేడ్లను అడ్డుపెట్టారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సుబేదారి జంక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగులబెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు, బీఆర్ఎస్వీ శ్రేణుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకొని వారిని మడికొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి దయాకర్‌రావు మండిపడ్డారు. ఇది సీఎం నిరంకుశ వైఖరికి నిదర్శమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్రమాలు, మంత్రుల అవినీతి, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడునా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ నేతలపై అక్రమ, కుట్రపూరిత కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దా స్యం వినయ్‌భాసర్ మండిపడ్డారు. ప్రజల తరఫున పోరాటాలను ఆపే ప్రసక్తే లేదని తే ల్చి చెప్పారు. జై తెలంగాణ అంటున్న తమ నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు కుట్రలు, వేధింపులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని చెప్పారు.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తేతెలంగాణ)/శంషాబాద్ రూరల్/సుబేదారి: నో టీసులివ్వకుండా తనను అరెస్ట్ ఎట్లా చేస్తారంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అరెస్టు చే సేందుకు రాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశా రు. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో పోలీసులు పనిచేయడం దౌర్భాగ్యమంటూ మండిపడ్డారు. కమలాపూర్ మండలం గుండేడులో అక్రమ క్వా రీపై ప్రశ్నించినందుకే తనను అరెస్టు చేస్తున్నారని తెలిపారు. ‘నాకు బెయిల్ మం జూరు కావడానికి కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్‌కు చేతులు జోడించి నమస్కారం చేస్తున్న. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బండారాన్ని రేపు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ద్వారా బయటపెడుతా. నాకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు’ అని తెలిపారు.