నాడు ఉత్తమ్, జానారెడ్డితోపాటు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడూ మాట్లాడలేదు. కేసీఆర్ పాదయాత్ర చేసి.. ‘సీఎం గారూ.. నీళ్లిస్తావా? లక్ష మందితో డ్యామ్‌పైకి రావాల్నా?’ అని హెచ్చరించడంతో సాయంత్రానికే నీళ్లిచ్చారు. నేడు కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండ నుంచి చేపడుతున్న ఉద్యమం విజయవంతం అవుతుంది.
-జీ జగదీశ్‌రెడ్డి
Jagadish Reddy | సూర్యాపేట, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడంతో ఐదు ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా తెలంగాణకు ద్రో హం చేశారని ఫైరయ్యారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగుతున్నారని, సిగ్గులేకుండా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 13న ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే మరో పోరాటానికి సిద్ధమవుతున్నారని స్పష్టంచేశారు. ఇది రాజకీయం కాదని, తెలంగాణ ప్రజల బతుకుదెరువు సమస్య అని చెప్పారు. తెలంగాణ హక్కు రక్షణకు కొట్లాట తప్పదని, ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించే నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ము ఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
హక్కుల పరిరక్షణే ప్రధాన ఎజెండా
కృష్ణా జలాలపై మన హక్కులను పరిరక్షించుకోవడమే ప్రధాన ఎజెండా. కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగించి ఎదురు దాడికి దిగుతున్నది. ఇది రాజకీయం కాదు, పూర్తిగా బతుకు దెరువు సమస్య. తెలంగాణలో కేసీఆర్ మార్క్‌లను చెరిపేస్తామంటూ రేవంత్ సర్కార్ పనికిమాలిన పలు నిర్ణయాలు తీసుకుంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ల కోసం పోరాడి నాగార్జునసాగర్ ఆయకట్టుకు గత తొమ్మిదేండ్లుగా ఒక్క ఎకరం ఎండకుండా నీటిని అందించింది. నేడు నాగార్జునసాగర్ ఆయకట్టును కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా మళ్లీ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది.
నల్లగొండ సభ ద్వారా మరో ఉద్యమం
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతాఇంతా కాదు. సాగర్ ఎడమ కాల్వ, శ్రీశైలంలో వారికి ఇష్టమైనట్టు నీళ్లు తీసుకొనిపోయారు. ఆంధ్రాలో ఏ అవసరం ఉన్నా దౌర్జన్యంగా, దుర్మార్గంగా గేట్లు ఎత్తి నీటిని తీసుకొనిపోయేవారు. తెలంగాణకు మంచినీళ్లు లేకున్నా కృష్ణాడెల్టాకు నీళ్లు తీసుకుపోయారు. గత పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హక్కుగా ప్రతి చుక్కా వాడుకున్నాం. గతంలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని టెయిల్ఎండ్ రైతులు తమకు నీళ్లు రావడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలాంటి నాయకుల వద్దకు వెళ్తే.. ‘అది టెయిలెండ్.. మీకు నీళ్లు రావు’ అని చెప్పేవారు. రైతులు కూడా నమ్మేవారు. కానీ గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం టెయిల్ఎండ్కు కూడా నీళ్లిచ్చింది. అంతకుముందు నాగార్జునసాగర్ మొదటి తూము అయిన రాజవరం మేజర్‌కు యా భై ఏండ్లలో నీళ్లు చూడలేదు.. కానీ, మేం చివరి వరకు నీళ్లిచ్చాం. ఇన్ని చేసి నీటి వాటాను హక్కుగా వాడుకుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా, రైతులపై కక్ష గట్టినట్టు నీటి లెక్కలు తేలకుండానే నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగించింది. అందుకే నల్లగొండ సభ ద్వారా ఉద్యమం ప్రారంభిస్తున్నాం.
రెండోసారి కేసీఆర్ నీళ్ల పోరాటం
తెలంగాణ హక్కుల కోసం ఎప్పుడూ ఏ జాతీయ పార్టీ తెలంగాణ ప్రజల వైపు నిలబడలేదు. బీఆర్ఎస్, కేసీఆర్ తప్ప ఎవ్వరికీ తెలంగాణ పట్ల సోయి లేదు. నీళ్లకు ఇబ్బందిలేకుండా పదేండ్లు తెలంగాణ రైతులు పంటలు పండించుకున్నారు. మళ్లీ ఇవ్వాళ 2000 సంవత్సరంనాటి పరిస్థితి వచ్చింది. నేడు నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండ వేదికగా మరో పోరాటానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు.
కేఆర్ఎంబీ అంశంపై నాడు ఏం జరిగిందంటే..
ప్రాజెక్టుల్లో నీటి వాటాను తేల్చకుండా కేంద్రం ఎప్పుడూ జాప్యం, మోసం చేస్తూ వస్తున్నది. మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది. ఈ ఒ ప్పందాన్ని రాసింది జైరాం రమేశ్. నాడు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. కేసీఆర్ ఎక్కడా లేరు. నాడు ఒక్క సంవత్సరంలో పు ట్రిబ్యునల్ వేసి నీటి వాటాలు తేల్చుతామని చెప్పారు. ట్రిబ్యునల్ వేయకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. నాటి కేంద్రమంత్రి కేసు విత్‌డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని చెప్పారు. అది మినిట్స్‌లో రికార్డు చేస్తేనే విత్‌డ్రా చేసుకుంటామని నాటి సీఎం కేసీఆర్ స్పష్టంచేసి, విత్ డ్రా చేసుకున్నారు. అయినా కదలికలు లేకపోవడంతో మళ్లీ కోర్టుకు వెళ్లారు. 14 నెలల క్రితం గడువు పెట్టకుండా కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. జాతీయ, అంతర్జాతీయ జలచట్టాల ప్రకారం నీటి వాటాలు తేల్చేందుకు ఆరు నెలల గడువు పెట్టాలని కోరాం.
రేవంత్ సర్కార్‌ది అవగాహన రాహిత్యం
గతంలో ఆంధ్రా నాయకులు కేఆర్ఎంబీని వాడుకొని తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని హక్కులను సాధించుకున్నది. కానీ రేవంత్ ప్రభుత్వానికి కనీసం సోయి లే దు. అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు సాగర్ డ్యామ్ మీదకు ఏపీ పోలీసులు వచ్చారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసలు ఏం జ రిగింది? ఏమి చేయాలనే ఆలోచన, సోయి లేకుండా సాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగించింది. తదనంతరం అధికారులు సంతకాలు చేశారంటూ బుకాయిస్తున్నది. ఇంత పెద్ద సమస్యపై ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సిగ్గులేకుండా మాట్లాడటం వారికే చెల్లింది. అందుకే మళ్లీ కేసీఆర్ కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.
నీటి వాటా దక్కకుంటే పెను ప్రమాదమే
కృష్ణానదిలో తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా దక్కకుంటే పెను ప్రమాదమే ముంచుకొస్తుంది. గత తొమ్మిదిన్నరేండ్లలో సాగర్ జలాలతోనే నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపాం. నీటి వాటా దక్కకుంటే సమస్య పునరావృతం అవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో మంచినీళ్లు ఉండవని ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు పారిశ్రామికవేత్తలే కాదు ప్రజలు కూడా ఇక్కడకు వచ్చేందుకు జంకేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వ పనితీరుతో మంచినీళ్లు, విద్యుత్తు విషయంలో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చింది. ఆ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోవాలి. ఇది ఎవరో ఒక్కరి సమస్య కాదు. ఐదు జిల్లాల ప్రజల బతుకు పోరాటానికి సంబంధించింది.
నల్లగొండ సభతో జాగృతం
నల్లగొండ సభతోపాటు తదనంతరం వివిధ కార్యక్రమాల ద్వారా కేఆర్ఎంబీకి వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసేలా కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. మన హక్కులు మనం కాపాడుకునేంత వరకు తెలంగాణ సమాజం కొట్లాడాల్సిందే. రెండు రాష్ర్టాల నీటి వాటాలు తేల్చినంత వరకు నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగించరాదు. నీటి వాటా తేలిన తరువాత ఏదైనా చేసుకోవచ్చు. లేదంటే మళ్లీ కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారి కానున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు నిలదీయాలి.
చంద్రబాబు హయాంలో వరుసగా ఏడేండ్లు ఒక్క పంటకూ నీళ్లివ్వలేదు. కృష్ణా డెల్టాకు నీటిని వదిలి కుడి కాల్వ ఆయకట్టులో పొట్టకు వచ్చిన వరి ఎండిపోయినా స్పందించలేదు. ఒక్క తడికి నీళ్లివ్వాలని రైతులు కోరినా నాడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డితోపాటు ఏఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదు. అలాంటి పరిస్థితిలో కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి.. ‘సీఎం గారు నీళ్లిస్తావా? లక్ష మందితో డ్యామ్‌పైకి రావాల్నా?’ అని హెచ్చరించడంతో ఆరోజు సాయంత్రానికే నీళ్లిచ్చారు. మళ్లీ నేడు కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన నల్లగొండలో సభ ద్వారా చేపడుతున్న ఉద్యమం విజయవంతం అవుతుంది.
– జీ జగదీశ్‌రెడ్డి