MLA Jagadish Reddy | సూర్యాపేట : కంచె గచ్చిబౌలి భూముల వాస్తవాలను ఏఐకు ముడిపెట్టడం హాస్యాస్పదమని.. నెమళ్ల అరుపులు, పోలీసుల లాఠీచార్జీలు, జింకల చావులు, బుల్డోజర్లు కుడా ఏఐ సృష్టేనా అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన రివ్యూలో ఆయన మాట్లాడినట్లు ప్రకటనలో వచ్చిన విషయాలపై జగదీష్ రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ తీరు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా వుందని.. అసలు అది సీఎం స్థాయిలో జరగాల్సిన రివ్యూలా లేదని ఏద్దేవా చేశారు. సీఎం తీరుకు సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నరన్నారు. అధికారులు, అనుచరులు ఇస్తున్న సలహాలపై పునరాలోచన చేసి మాట్లాడితే మంచిదిని హితువు పలికారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించడం రేవంత్ పనిగా పెట్టుకున్నాడని.. ఏఐ యూనివర్సిటీ పెడతానన్న రేవంత్ ఆ విషయంలో ముందుకు సాగుతాడా అని ప్రశ్నించారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కన్నా మీ అనుముల ఇంటెలిజెన్స్‌ను నమ్ముకోవడమే మంచిదని.. వాళ్లిచ్చే బ్రిఫ్ను నమ్ముకుని నవ్వులపాలవుతున్నారన్నారు.
అసలు AI కంచె గచ్చిబౌలిలో పుట్టిందా.. అక్కడ ఊర కుక్కలు జింకలను చంపింది AI సృష్టేనా అని ప్రశ్నించారు. లేనివి సృష్టించడం.. తప్పుడు ప్రచారాలు చేయడం కాంగ్రెస్, రేవంత్ రెడ్డికే అలవాటన్నారు. అసలు కంచె గచ్చిబౌలి విషయంలో రాజకీయాలు మాట్లాడలేదన్నారు. ఒకవైపు రాష్ట్రం నష్టపోతుంది.. జరిగిన అభివృద్ధి అంతా వెనక్కి పోతుందని.. దీనికి తోడు జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని బాధ తప్ప మరొకటి లేదన్నారు. చైనా, పాకిస్తాన్ యుద్దాలకు ఇక్కడ AIకి సంబంధం ఏమిటని.. ఆ విషయం గురించి అనేక మంది మాతో చెప్పి నవ్వుకుంటున్నారని ఈ సందర్బంగా అయన గుర్తు చేశారు.
ఈ విషయంలో కోర్టుకు పోతమంటే వాళ్లకు చివాట్లు తప్పవన్నారు. జబ్బును గుర్తించకుండా మందులు వాడతామన్న తీరులా రేవంత్ పోకడ ఉందని.. సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకున్నప్పుడే వాళ్ళ ఆలోచన మార్చుకోవాల్సిందన్నారు. యూనివర్సిటీనే మార్చుతామన్నా రేవంత్ లీకులు కూడా అనాలోచితమేనని.. అలాంటప్పుడు అసలు ఆ కొత్తగా యూనివర్సిటీ అనుకుంటున్న దగ్గరే 400 ఎకరాలు కూడా ఇచ్చుకోవచ్చుకదా అన్నారు. విద్యార్థులు, ప్రజలను తక్కువ అంచనా వేయడం సరికాదని.. రేవంత్ ఇప్పటికైనా తెలివితక్కువ పనులు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సూచించారు.