MLA Jagadish Reddy | సూర్యాపేట : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రైతులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగం సరిగా లేదు.. సీఎం సమీక్షలు నిర్వహించడమే మరిచాడు అని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థులకు హాస్టల్ వార్డెన్లు తమ సొంత ఖర్చులతో భోజనం పెట్టించే పరిస్థితి నెలకొంది. కోడిగుడ్లు, కిరాణా దుకాణాలకు బిల్లులు రాక వారి దయ దక్షిణాయాలపై హాస్టల్లో నడుస్తున్నాయి. పొద్దున లేస్తే కేటీఆర్, కేసీఆర్‌ను తిట్టడమే తప్ప శాఖలపై రివ్యూ నిర్వహించే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగం సక్కగా లేదు అని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రభుత్వాసుపత్రికి వెళితే బయటకు వచ్చేదాకా నమ్మకం లేదు. కరోనా సమయంలో దేశానికే గర్వకారణంగా సేవలందించిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో మందులు లేక వైద్యానికి ఇబ్బంది నెలకొన్న పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్యరంగం ఏ ఒక్కరంగం కూడా రాష్ట్రంలో సక్కగా లేదు ఇంత మాత్రం దానికి రివ్యూలు ఎందుకు..? రైతు భరోసా 12 వేల కోట్లకు 6000 కోట్లు మాత్రమే ఇచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు పోటీలు పడి సంపాదించుకుంటున్నారు అని ఆరోపించారు.
రాష్ట్రంలో అన్ని శాఖలు పనిచేయడం లేదని పనిచేసే శాఖ ఏదైనా ఉందంటే అది పోలీస్ శాఖనే. సూర్యాపేట, నల్లగొండ ఎస్పీలు జాగ్రత్తగా పని చేయాలి. ఎస్సై, సీఐలను మీరు కంట్రోల్ చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కాదు. పెద్దాపురం నుంచి మేళ్లచెరువు, డిండి వరకు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రతిపక్ష నాయకుల మాటలను ఫార్వర్డ్ చేసిన పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరిస్తున్నారట. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తూ బాధ్యతగా వ్యవహరించుకుంటే మంచిది అని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కేసీఆర్ 10 ఏళ్లలో పంటకు ముందే యూరియా తెప్పించి అందుబాటులో ఉంచాడు. నేడు ముఖ్యమంత్రి యూరియా అందుబాటులో ఉందని చెబుతుంటే మంత్రులు మాత్రం కేంద్రం సహకరించడం లేదని చెబుతున్నారని ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. ముఖ్యమంత్రి మాటలు రైతులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. పదేళ్లకు ముందు నీళ్ల గొడవలతో స్టేషన్లలో కేసులు ఉంటే మరల ఇప్పుడు యూరియా అడిగితే కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. నల్లగొండ విషయానికి వస్తే ఎస్ఎల్బీసీకి మళ్ళీ పోదాం అని అంటుండు ఆయన మరి వాటర్‌లో నీళ్లు కలుపుతాడు నీళ్లలో వాటర్ కలుపుతాడో. ఎస్ఎల్బీసీలో చచ్చిన శవాలను తీసేందుకు దిక్కులేదు అని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
పోలీస్ వ్యవస్థలో గత పదిహేనులుగా తెలంగాణ దేశానికి నెంబర్ వన్‌గా ఉంది. ఎన్నో కేసులను ఛేదించింది. అలాంటిది తెలంగాణ పోలీసులు కించపరుస్తూ సిపిఐకి అప్పగించడం ఏమిటి..? మీ నాయకుడు రాహుల్ గాంధీ సీబీఐని బీజేపీకి పొలిటికల్ రిక్రూట్మెంట్ సెంటర్‌గా పని చేస్తుందని చెబుతుంటే నువ్వేమో అదే సీబీఐకి అప్పగించావు. సీబీఐకే కాదు అవసరమైతే ఎఫ్‌బీఐకి మోసాధాకు అప్పగించండి అని జగదీశ్ రెడ్డి సూచించారు.