BRS MLA Vivekananda | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు మారిందని, ఆయన పేరు రెవెన్యూ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద చెప్పారు. రెవెన్యూ రెడ్డికి కోర్టు మొట్టికాయలు వేసినా ఆయన తీరు మారడం లేదన్నారు. రేవంత్ రెడ్డి పదే పదే ధరణిపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయిందని, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌కు రేవంత్ రెడ్డి వెళ్తే బట్టలిప్పి కొడుతారని వివేకానంద హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి సమాచార హక్కు ద్వారా దరఖాస్తు పెట్టి వసూళ్లు చేసుకోవడం, ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేయడం, మాయమాటలు చెప్పడం పరిపాటిగా మారిందన్నారు. ఆయన తన వైఖరి మార్చుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో కేపీ వివేకానంద మాట్లాడుతూ ధరణి గురించి రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, ధరణిలో ఇప్పటి వరకు 27లక్షల లావాదేవీలు జరిగాయన్నారు.
పారదర్శకంగా, జవాబుదారీతనంతో రైతులకు సేవలు అందించడానికి ధరణి తెచ్చారన్నారు. తన పదవిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబసభ్యులపై తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లాలో రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసిన భూములను 2006లో రిజిస్ట్రేషన్ చేశారని, నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకుంటే మంచిదని వివేకానంద అన్నారు. ధరణిలో ఏదైనా తప్పొప్పులు జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో సరైన భూములను నిషేధిత జాబితాలో పెట్టారని, హక్కుదారుల భూములను ఏదో కారణంతో నిషేధిత జాబితాలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందన్నారు. ఇప్పుడు ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ధరణితో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచి తమ భూముల వివరాలను పరిశీలించుకునే అవకాశం ధరణి ద్వారా లభ్యమవుతుందన్నారు.
ధరణిని బ్రహ్మండంగా ప్రజలు ఆదరిస్తున్నారని, లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్ అతి తక్కువ సమయంలో జరిగాయని వివేకానంద తెలిపారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ధరణి వంటి పోర్టల్ తెచ్చే దమ్ముందా? అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి చెప్పిన సర్వే నంబర్లలో అక్రమాలు జరిగితే కోర్టుకు వెళ్ళాలని, ఆ సర్వే నంబర్లలో 2006లో రిజిస్ట్రేషన్లు జరిగాయని, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని విషయం గుర్తుంచుకోవాలన్నారు.
రేవంత్ రెడ్డి చెప్తున్న మూడు సర్వే నంబర్లు ఇప్పటికీ ధరణిలో భూదాన్ పేరుతోనే ఉన్నాయని, తిమ్మాపూర్‌లో ఉన్న పట్టా భూముల గురించి రికార్డుల్లో తనిఖీ చేసుకోవచ్చని వివేకానంద చెప్పారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని, కర్ణాటకలో బీజేపీ అట్టర్‌ప్లాప్ షో చేసిందని, అక్కడ సిద్దిరామయ్య, డీకే శివకుమార్ మాదిరిగా తాను ఉన్నట్టు రేవంత్ రెడ్డి ఊహించుకుంటున్నాడని, కలల నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలన్నారు.
తెలంగాణాలో రాబోయేది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వివేకానంద స్పష్టం చేశారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించడం ఖాయమన్నారు. చర్లపల్లి జైలుకు వెళ్లడం అలవాటుగామారిన రేవంత్ రెడ్డి అందరూ తనలాగే వెళ్తారన్న భ్రమల్లో ఉన్నాడని, రేవంత్ రెడ్డి భ్రమల నుంచి బయటకు రావాలన్నారు.