ఆదిలాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు అందకపోవడంపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ఆదిలాబాద్ జిల్లా సంచికలో వచ్చిన కథనానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్‌లో స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో 22 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించడంపై ‘నమస్తే’లో కథనం ప్రచరితమైంది. బీఆర్ఎస్ పాలనలో ఆదర్శంగా నిలిచిన ముక్రా(కే).. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్వానంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని సీఎంవోతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ట్యాగ్ చేశారు.
అణిచివేత దుర్మార్గం: శశిధర్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో రుణమాఫీ కాలేదని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని బీఆర్ఎస్ నేత, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
మాఫీ పూర్తి కాకుంటే పోరాటమే: కూనంనేని
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 20: రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుంటే పోరాటం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ రుణమాఫీ విషయంలో రైతాంగానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదని, వెంటనే చొరవ తీసుకొని అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణ మాఫీ చేయాలని సూచించారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే సమావేశంలో ఉద్రిక్తత పురుగుల మందు డబ్బాతో వచ్చిన రైతు
గీసుగొండ, ఆగస్టు 20: గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంపై మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కోనాయిమాకులలో రైతులతో నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. గీసుగొండ, ఊకల్, మచ్చాపురం, సంగెం మండలంలోని చింతలపల్లి, తీగరాజుపల్లి రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. రైతులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతు చల్లా రవి పురుగుల మందు డబ్బాతో వచ్చి గ్రీన్‌ఫీల్డ్ హైవేను ఆపాలని డిమాండ్ చేశారు. తనకు రెండెకరాల భూమే దిక్కని, అదిపోతే చావే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యాడు. సీఐ వెంటనే తేరుకుని మందు డబ్బాను లాక్కున్నాడు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం ఆగదని, ఆలైన్మెంట్ మార్చడం కుదరదని తెగిసి చెప్పారు. ఆర్డ్డీవో కృష్ణవేణి, తహసీల్దార్ రియాజుద్దీన్ పాల్గొన్నారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధిత రైతు మృతి
శాయంపేట, ఆగస్టు 20 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన దాసరి వెంకటేశం (60)కు గట్ల కనపర్తి శివారులో 20 గుంటల భూమి ఉంది. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భాగంగా భూసేకరణలో భూమి పోతుందని తెలియడంతో తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురై దవాఖానలో చేరాడు. మంగళవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈయనకు భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు.