Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మంచి వక్త.. మంచి కళాకారుడు అధ్యక్షా.. అంటూ ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హరీశ్‌రావు గుర్తు చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టారు.
ఆరు గ్యారెంటీలు ఆవిరైపోయాయి. కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజా జీవితం చక్కగ సాగుతున్న సందర్భం. స్వర్గాన్ని కిందకు దించుతామనే రీతిలో వీళ్లు హామీలు ఇచ్చిన్రు. ఆరు గ్యారెంటీల పేరుతో బాండు పేపర్లు ముద్రించి ఆశలు రేపిన్రు. ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన అంశాల మీద ప్రస్తావన లేదు, ప్రతిపాదన లేదు. దాదాపుగా చేతులెత్తేసారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా 2500 మహాలక్ష్మి ఊసే ఎత్తలేదు. మాట కూడా ఎత్తని మరో హామి, 4వేల పింఛన్. ముసలివాళ్లు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలు తదితర 44 లక్షలనిరుపేద ఆశల్ని ఈ బడ్జెట్ అడియాశలు చేసింది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి వక్త, మంచి కళాకారుడు అధ్యక్షా… ఎన్నికల ముందు పల్లె పల్లెనా తిరుగుతూ ఎంతో నాటకీయంగా, డ్రమటిక్‌గా వారు చెప్పిన డైలాగులు ఒక్కసారి మళ్లీ గుర్తు చేస్తున్నా.. ‘‘వచ్చే నెలా డిసెంబర్ 9 నాడు, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. రెండు వేలు కాదు, నాలుగు వేల పించన్ వస్తది’’ అన్నడు. ఇంకేం అన్నడు‘‘మనువడు వచ్చి కాళ్లు ఒత్తుతడు, పెట్రోల్ కు ఐదు వందలో, వెయ్యో అడుక్కుంటడు అవ్వా’’ అన్నడు. ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది ఆసరా పించన్దారుల చెవుల్లో ఈ మాటలు ఇంకా గింగురుమంటున్నయి. మనవడు కాళ్లొత్తడం లేదు గానీ, అవ్వా తాతలు కన్నీళ్లు ఒత్తుకొంటున్నరు. పింఛన్ 4 వేలు ఎప్పుడైతదా.. అని ఎదురుచూస్తూనే కొందరు కాలం చేసిన్రు. తీరా జరుగుతున్నదేమిటి? ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కానీ, లక్షమందికి పింఛన్లు కోత పడింది. ఇంట్లో ఎందరుంటే అందరికీ ఇస్తాం అని ఊదరగొట్టిన్రు. ఇవాళ అవ్వ లేదు, తాత లేదు, 4 వేల పెన్షన్ లేదు అధ్యక్షా.. ఇగ యువ వికాసం పేరిట రూ.5లక్షల విద్యా భరోసా కార్డు ఊసే లేదు. భట్టి విక్రమార్క 2 బడ్జెట్లు పెట్టినా దాని ప్రస్తావనే లేదు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట 12వేలు అన్నరు. కోటి మంది కూలీలు ఉంటే లక్ష లోపే ఇచ్చ చేతులు దులుపుకొన్నరు. కోటి మందికి ఇవ్వాలంటే 12వేల కోటక్లు కావాలి. గత బడ్జెట్ లో 906 కోట్లు పెట్టారు. 300 కోట్లు కోత పెట్టిఈ బడ్జెట్ లో 600 కోట్లకే కుదించారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కూలీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అధ్యక్షా.. బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినయి. గాంధీలిచ్చిన వాగ్దానాలు గాలి మాటలే అయినయి. ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు గానీ, అందాల పోటీలు పెడుతరట. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టున్నది. 2 బడ్జెట్ల తర్వాత ఆరు గ్యారెంటీల మీద చేతులెత్తేశారు. ఆరు గ్యారెంటీల విషయంలో మీ వైఖరి ఎట్లుందంటే..
ఆత్మ శుద్ది లేని ఆచారమదియేలా
భాండ శుద్ది లేని పాకమేలా
చిత్తశుద్ది లేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినురవేమా
మీ ఆరు గ్యారెంటీల అమలు తీరు చిత్తశుద్ది లేని శివపూజ లెక్కనే ఉన్నది అని హరీశ్‌రావు విమర్శించారు.