Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారాయని, గాంధీభవన్‌లో ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయని, ఎవరిని అరెస్టు చేయాలో అక్కడే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ పాలన ఇందిరాగాంధీ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నదని విమర్శించారు. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుకుపడలేదని గుర్తుచేశారు. గురువారం ఉదయం కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ఆయనను అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాత్రి 8 గంటల సమయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి తెచ్చిన మార్పు నిర్బంధాలు, అక్రమ అరెస్టులే తప్ప మరేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఏ నిరుద్యోగ యువతకు అయితే మాట ఇచ్చారో అదే యువతను అశోక్‌నగర్‌లో వీపులు పగేలాలా కొట్టించారు. గిరిజనులకు గొప్ప మాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి రాత్రిపూట గిరిజనుల మీద దాడి చేయించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని ఎమర్జెన్సీ పాలన తెచ్చారు. ఆడవాళ్లను పోలీసు బూటుకాళ్లతో తొక్కిపట్టి వారి భర్తలను అరెస్టు చేశారు. ఇప్పటికీ వారందరూ జైలు నిర్బంధంలో ఉన్నారు. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుకు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్లను సైతం కూకటివేళ్లతో పెకిలించిన దేశం భారతదేశం’ అని హరీశ్‌రావు హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొకాలని, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘పోలీస్స్టేషన్లు అన్నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయాయి. రాష్ట్రంలో ఇవాళ కేసులు, ఎఫ్ఐఆర్లు పోలీస్టేషన్లలో తయారవుతలేవు, గాంధీభవన్‌లో తయారవుతున్నయి. ఎవరిని అరెస్టు చేయాలో గాంధీభవన్‌లోనే నిర్ణయిస్తున్నరు. అక్కడి నుంచి, కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఆదేశాలిచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రేవంత్‌రెడ్డి శాశ్వతం కాదు. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వమో, ఇంకో ప్రభుత్వమో వస్తదని గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలే తప్ప రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పనిచేస్తే మీరు ఇబ్బంది పడతారు. చట్టం, రాజ్యాంగం శాశ్వతం. కానీ, రేవంత్‌రెడ్డి శాశ్వతం కాదు’ అని హెచ్చరించారు.
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైకోలాగా ప్రవర్తిస్తున్నరు. పగ, ప్రతీకారంతో శాడిస్టిక్ ప్రెజర్‌తో పనిచేస్తున్నరు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నరు. ఏడాది పాలనలో ఫె్లై ఓవర్, ఎస్టీపీ, కాళోజీ కళాక్షేత్రం ఇలా ఏదైనా కేసీఆర్ పాలనలో కట్టిందే. వాటినే నువ్వు ప్రారంభిస్తున్నవు తప్ప, నీ ఏడాది పాలనలో ఒక భవనమైనా కట్టినవా? రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, రాక్షస పాలన నడుస్తున్నది. అక్రమ అరెస్టులు తప్ప మరే గ్యారెంటీ అమలవుతలేదు. ఇందిరా కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలన నాడు ఎలా ఉన్నదో నేడు రేవంత్ పాలన అదే ఎమర్జెన్సీని తలపిస్తున్నది. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తుంది. ప్రజాపాలన ఉంటే ప్రశ్నించే పరిస్థితి కల్పించాలి. కానీ, ఇక్కడ ప్రశ్నించే పరిస్థితి కనిపించడం లేదు’ అని మండిపడ్డారు.
‘దేశ ప్రతిపక్ష నాయకుడిని, నన్నెందుకు అరెస్టు చేస్తరు’ అని రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని అడుగుతున్నరు. మరి తెలంగాణలో కూడా మీ సీఎం రేవంత్ అదే చేస్తున్నరు కదా. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి లగచర్లకు వెళ్లే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది. అర్ధరాత్రి పూట మహిళల గొంతు మీద కాలు పెట్టి భర్తలను అరెస్టుచేస్తే గిరిజన కుటుంబాల బాధ లు వినడానికి వెళ్తున్న ప్రతిపక్ష నేతలను రేవంత్ ప్ర భుత్వం అడ్డుకున్నది. హక్కుల సంఘాల మహిళా నేతలను సైతం అడ్డగించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఎకడుంది. రాహుల్‌గాంధీ.. ముం దు మీ రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పు. ప్రతిపక్ష నేతలను అడ్డుకోవద్దని ఆదేశాలు ఇవ్వు. లేకపోతే సీఎం పదవి నుంచి తొలగించు. ఇటీవల రాహుల్ కూడా రేవంత్‌రెడ్డిని పక్కన పెట్టారు. అందుకే ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదు. మంత్రులు కుర్చీ లాక్కోవాలని చూస్తున్నారు. ఈ ప్రస్ట్రేషన్‌లో రేవంత్‌రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నారు’ అని విమర్శించారు.
‘ఉదయం నుంచి కూడా ఎంతో ఓపిగ్గా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేయడానికి 12 గంటలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు, కెమెరామెన్లకు హృదయ పూర్వక ధన్యవాదాలు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులకు నిరసనగా ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ కుటుంబసభ్యులకు, ఆ వార్తలు కవర్ చేసిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
‘రేవంత్‌రెడ్డి ఎంతకూ డబ్బులు సంపాదించాలె, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలె అనుకుంటున్నరు తప్ప పాలన లేదు. ఏడాది పాలనలో మహిళలకు లక్ష కోట్ల రుణమన్నవు, అదంతా బోగస్. మహిళలకు మహాలక్షి పింఛన్ ఇస్తనన్నవు.. అదీ బోగస్. ఇవాళ నువ్వు మమ్మల్ని సలహాలివ్వాలని అడుగుతున్నవు. మేం చాలా సలహాలిస్తున్నాము. కానీ నువ్వు పాటిస్త లేవు కదా? మేం నీ పాలనను అడ్డుకుంట లేము కదా, రేవంత్, భట్టి ఇద్దరూ బాండ్‌పై సంతకాలు చేసి హామీనిచ్చారు. వరంగల్ డిక్లరేషన్ 9 హామీల్లో ఒకటి కూడా అమలు కాలేదు. వాటిని అమలు చేయమని సలహా ఇచ్చాం కదా. మూడుసార్లు రైతుబంధు ఇవ్వమని అడిగినం కదా. 4 వేల వృద్ధాప్య పింఛన్ ఎపుడిస్తవు అన్నం కదా. మూసీలో గరీబోళ్ల ఇండ్ల కూలగొట్టద్దు అన్నం. అఖిలపక్షాన్ని పిలవమమన్నం. ఇది మా సూచన కాదా.. ఏ సూచనా తీసుకునే విజ్ఞత నీకు లేదు. ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నావు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయి. కేసులు, ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లో కాకుండా గాంధీభవన్‌లో తయారవుతున్నయి. ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీభవన్‌లో నిర్ణయిస్తున్నరు. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. చట్టమే శాశ్వతం.. రేవంత్‌రెడ్డి కాదు.
‘రాష్ట్రంలో చట్టం కాంగ్రెస్ చుట్టం అయింది. పోలీసులు, హోంగార్డుల సమస్యలు ఎం దుకు పరిషరిస్తలేవు? 7 నెలల నుంచి పోలీసులకు టీఏలు ఇస్తలేవెందుకు? స్టేషన్ అలవెన్సులిస్తలేవు, సీసీ కెమెరాలు బాగు చేస్తలేవు. ‘30-40 వేలు రావాలి సార్, అవి వస్తే పిల్లల ఫీజులు కట్టాలి సార్. ఎవరికి చెప్పుకోవాలో అర్థం అయితలేదు’ అని పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. పోలీసులు కూడా ప్రతిపక్షానికి తమ బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. రైతు రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టినవు, రైతుబంధు ఎప్పుడిస్తవో చెప్పడం లేదు. రైతులకు కష్టాలు అసలు ఎప్పుడన్నా విన్నారా? ఒకరోజన్నా శాసనసభలో మంచి సూచనలను వినే ఓపిక ఉండదు. అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడనిస్తవా?’ అని నిలదీశారు.
‘నువ్వు ఎన్నో ఉపన్యాసాలు ఇస్తున్నవ్. కేసీఆర్ పేరెత్తకుండా ఉపన్యాసమిచ్చినవా? కేసీఆర్ పేరు ఎత్తకుండా ప్రజల గురించి, ఒక పాలసీ గురించి, ఒక అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడవా? నువ్వు నోరు ఎత్తితే కేసీఆర్‌ను తిడుతుంటివి. పేగులు మెడలో వేసుకుంటా. లాగుల్లో తొండలు జొరగొడతా.. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే పద్ధతి. ముఖ్యమంత్రిగా మర్యాదగా మాట్లాడితే, పాలసీ గురించి మాట్లాడితే, ప్రతిపక్షంగా మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. నువ్వు మర్యాద లేకుండా బూతులు తిడితే మేం భరించాలా, నీకు సూచనలివ్వాలా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
మా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసి 12 గంటలు అవుతున్నది. అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళితే ట్రెస్పాస్ అంటవు, అదేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా? ఎమ్మెల్యే ఇంట్లో చొరబడి, తలుపులు పగులగొట్టి అరెస్టు చేస్తవు. ఉదయం నుంచి సాయంత్రం దాకా 12 గంటల నుంచి బెయిలివ్వరు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నరు? దొంగరాత్రి టెర్రరిస్టును తీసుకుపోయినట్టు తీసుకపోతరా? నాంపల్లి కోర్టుకు కూడా తీసుకుపోలేదెందుకు. ఏ సెక్షన్లు పెట్టాల్నో గాంధీభవన్ నుంచి, సీఎం రేవంత్ నుంచి పోలీసులకు ఇంకా ఆదేశాలు రాలేదా? అందుకే ఈ ఆలస్యం చేస్తున్నారా? నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, డీజీపీ సమాధానం చెప్పాలి. ఇది ఎకడి న్యాయం. ఎఫ్ఐఆర్ రాయడానికి 12 గంటలైనా సరిపోవడం లేదా? ఇది ప్రజా పాలన కాదు, రాక్షసపాలన, పోలీసు పాలన, పీడిత పాలనగా మారింది’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
‘రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలను, మహిళలను అరెస్టు చేశారు. వీళ్లందరినీ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలి. పోలీసు అధికారులు రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలని కోరుతున్నాం. కౌశిక్‌రెడ్డిని విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ నిద్రపోదు. ఆయనకు అండగా ఉంటది. పోలీసులు చట్టానికి లోబడి ఉండాలి.. రేవంత్‌రెడ్డి కాదు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.