Harish Rao | సంగారెడ్డి, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని తమ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో కలిపి బదులు తీర్చుకుంటామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. కేసీఆర్ పొలంబాట పట్టడంతో కాంగ్రెస్ మంత్రులకు నిద్ర కరువైందని పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ సమీపంలో నిర్వహించిన రైతుదీక్షలో పాల్గొన్న హరీశ్‌రావు అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ కరీంనగర్ పోయి ఎండిన పంటపొలాలు పరిశీలిస్తే మంత్రులు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. రైతులను ఆదుకోవాలన్న కేసీఆర్‌పై మంత్రులు విరుచుకుపడడం సిగ్గుచేటని, ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను మంత్రులు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడితే తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. పంటనష్టపోయిన రైతులకు రూ. 25 వేలు, చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని, రూ. 500 బోనస్ ఇవ్వాలని, పంటలకు సాగునీరు ఇవ్వాలని కేసీఆర్ అడగడం తప్పా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిడితే కాంగ్రెస్ పోపాలు పోవని పేర్కొన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ రైతుదీక్షలు చేపట్టినట్టు తెలిపారు. కరెంటు లేక, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని, దాని మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని హరీశ్‌రావు తెలిపారు. ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని విమర్శించారు. హామీలు నిలబెట్టుకోకుండా ఓట్లు అడిగేందుకు గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నేతలను చీపుర్లతో తరిమికొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేసే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని విమర్శించారు. బీజేపీ దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. దీక్షలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, ఎంపీపీలు సరళ, యాదమ్మ, నాయకులు గాలి అనిల్‌కుమార్, దేవీప్రసాద్, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, కాసాల బుచ్చిరెడ్డి, మల్లాగౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.