కరీంనగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన కరీంనగర్‌లోని తన నివాసం లో మీడియాతో మాట్లాడారు. కౌశిక్‌రెడ్డిని ముగ్గురు మంత్రుల ముందే పోలీసులు గొరగొర గుంజుకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్ పక్కపక్కనే కూర్చున్నారని, కౌశిక్‌రెడ్డి మాట్లాడి కూర్చున్న తర్వాత సంజ య్ అతన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
బీఆర్ఎస్ నాయకుల బట్టలు విప్పిస్తానని సంజయ్ రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు కౌశిక్ తనతో చెప్పారని వివరించారు. అందుకే కౌశిక్‌రెడ్డి.. సంజయ్ మాట్లా డే ముందు ‘నీది ఏ పార్టీ.. ఏ పార్టో చెప్పి మాట్లాడాలె’ అని నిలదీసినట్టు తెలిపారు. గొడవ జరిగినప్పుడు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వేదికపైనే ఉన్నారని, వీరు జోక్యం చేసుకుంటే ఇద్దరినీ అదుపు చేసే అవకాశం ఉండేదని చెప్పారు. ప్రభుత్వ సమావేశంలోకి పోలీసులు ఎలా వచ్చారని, ఒక ఎమ్మెల్యే అని కూ డా చూడకుండా మంత్రుల కళ్లెదుటే గొరగొరా ఎలా గుంజుకెళ్తారని నిలదీశారు. ఒక వేళ తమ అనుమతితోనే పోలీసులు లాక్కెళితే కౌశిక్‌రెడ్డికి ముగ్గురు మంత్రులు క్షమాపణ చెప్పాలన్నారు. ‘సీఐ గల్లా పట్టినట్టు కేసు పెట్టాలి’ అని ఒక మంత్రి చెప్తున్నట్టు తెలుస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ ని తలపిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, అరెస్ట్‌లు చేసినా, ప్రతి నాయకున్ని కాపాడుకుంటామని, ప్రశ్నించడం ఆపబోమని స్పష్టంచేశారు.
ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు?: బోయినపల్లి
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేస్తున్నా రో? ఏ సెక్షన్ కింద అదుపులో తీసుకున్నారో? ముం దుగా చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కారణాలు ముందస్తుగా చెప్పకపోవడం రాజ్యాంగం ప్రకారం తప్పు అని. ఇది చట్టం ముందు నేరమే అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే అకారణ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఇది అప్రజాస్వామికం : ఎల్ రమణ
సమీక్ష సమావేశాల్లో వాదాలు, ప్రతివాదాలు ఉంటాయని, వాటిపై కేసు లు నమోదు చేసే స్థాయికి తీసుకెళ్లడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆక్షేపించారు. ఇది అప్రజాస్వామికమని, ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కౌశిక్‌రెడ్డిపై పెట్టిన కేసును వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా కేసులను ప్రోత్సహించడం ఎవరికీ మంచిది కాదని హితవుపలికారు.
అరెస్ట్ అప్రజాస్వామికం: చల్మెడ
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అభిప్రాయపడ్డారు. ప్రతి సమీక్ష సమావేశంలో వాదనలు, ప్రతివాదనలు సాధారణమని, వాటిని ఆ సమావేశానికే పరిమితం చేయాలని, అలా కాకుండా వివిధ రకాల కేసులు పెట్టి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయడం చూస్తే ప్రభుత్వం ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతోందని మండిపడ్డారు. ఇలాంటి అరెస్ట్‌ల పర్వాన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, న్యాయ పరంగా ఎదుర్కొంటామని చెప్పారు.
హామీలపై నిలదీస్తే అరెస్టులా? : వేముల
కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలపై నిలదీస్తే అరెస్టులా? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
పారిపోతున్న సర్కార్‌కు తార్కాణమే అరెస్టు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రశ్నించినా రేవంత్ సర్కార్ తట్టుకోలేకుండా పోతున్నదని, ప్రజల్లో ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ నుంచి ప్రజాక్షేత్రం దాకా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేని దుస్థితికి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. పాడి కౌశిక్‌రెడ్డిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హేమమైన చర్య : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు అత్యంత హేయమైన చర్య అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేను తాను ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావో చెప్పాలని అడిగితే కేసు పెడతారా? అని మండిపడ్డారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బనాయించిన అక్రమ కేసులను స్పీకర్ చొరవ తీసుకొని న్యాయ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజ్యాంగానికి రేవంత్ సర్కార్ తూట్లు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామిక స్ఫూర్తికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అక్రమ నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను భయపెట్టలేరని స్పష్టంచేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను నిలదీస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. తక్షణమే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది ప్రతీకార పాలన: నిరంజన్‌రెడ్డి
కేసీఆర్ పాలనలో ఎన్నడూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, కార్యకర్తలను వేధించిన దాఖలాలు లేవని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దూషించిన, ద్వేషించిన వారిని పట్టించుకోకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశామని చెప్పారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అంతా విచిత్రంగా ఉన్నదని, రాష్ట్రంలో ప్రతీకార పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు.
దుర్మార్గపు పాలన: కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్టులా? అని మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అణచివేతలు ఆపాలి: అనిల్ కూర్మాచలం
అణచివేత ధోరణిని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు. ప్రశ్నించిన ఎమ్మెల్యేను అరెస్టు చేయటం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
ప్రతీకారమా? : ఎర్రోళ్ల శ్రీనివాస్
రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా? రాజకీయ ప్రతీకారమా? అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. అణచివేత, కక్ష రాజకీయాలు ఎంతోకాలం సాగవనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ అరెస్టులు బీఆర్ఎస్ శ్రేణులను ప్రశ్నించటం ఆపకుండా నిరోధించలేవని స్పష్టంచేశారు.
అరెస్టు అప్రజాస్వామికం : మేడే రాజీవ్‌సాగర్
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం అని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ పేర్కొన్నారు. రాష్ట్ర సరార్ కావాలనే ప్రశ్నించే గొంతులను అణచివేస్తుందన్నారు. పోలీసు కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆపమన్నారు.