Guvvala Balaraju | `నన్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే నాపై దాడి చేశారు` అని అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు ఆరోపించారు. గతంలో కూడా వంశీకృష్ణ దాడులు చేశారని అన్నారు. శనివారం అర్ధరాత్రి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరుల దాడిలో గాయపడ్డ గువ్వల బాలరాజు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా గువ్వల బాలరాజు ఆదివారం మీడియాతో మాట్లాడారు. తనపై దాడి జరుగుతుందన్న సమాచారంతో పది రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఈ విషయమై నాగర్ కర్నూల్ ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. తాను ప్రజల గుండెల్లో నిలిచిపోయానని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచి తీరుతానని చెప్పారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల ప్రాణాలతో బయట పడ్డానని గువ్వల బాలరాజు చెప్పారు.
‘నా కాన్వాయ్‌ను వెంబడించి దాడి చేశారు` అని గువ్వల బాలరాజు ఆరోపించారు. ‘కాంగ్రెస్ గూండాలు నాపై దాడి చేశారు. నా అనుచరులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి` అని చెప్పారు. డబ్బుతో రాజకీయం చేయొచ్చని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబుతాం అని బాలరాజు హెచ్చరించారు. `నన్ను, కార్యకర్తలను చంపాలని చూశారు. క్యాడర్, కార్యకర్తల మధ్య కొట్లాట పెట్టడం తగదు` అని చెప్పారు. ‘జైళ్ల నుంచి క్రిమినల్స్‌ను తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారని, పగలు, ప్రతీకారాలు మా సంస్కృతి కాదని కూలీ పని చేసుకునే తన తల్లిదండ్రులు భయ పడుతున్నారని చెప్పారు.