Minister Niranjan reddy | హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ హయంలో కర్ణాటక అంధకారంగా మారిందని, అక్కడ ఎన్నికల సందర్భం గా ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. 6 నెలల పాలనలోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజల ఆందోళనలు తట్టుకోలేక అక్కడి కాంగ్రెస్ అతలాకుతలం అవుతున్నదని ఎద్దేవాచేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ మేమే ఇచ్చినం’ అంటున్న కాంగ్రెస్ మాటను విని ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన బలిదానాలు, గుండె కోతలు, ఆ పార్టీ చేసిన లోతైన గాయాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని వెల్లడించారు. ఎన్నో అవమానాలు, అవహేళనల అనంతరం కేసీఆర్ నేతృత్వంలో పోరాడి తెలంగాణ సాధించుకున్నట్టు వివరించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలనను విప్లవంగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వేళ మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ ఆచరణాత్మక హామీలు ఇచ్చారని వెల్లడించారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధికి ఐకాన్‌గా నిలిపారని నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. విద్య, వైద్యం, తాగునీళ్లు, సాగునీళ్లు, విద్యుత్తు రంగాలలో గణనీయంగా అభివృద్ధి సాధించామని వెల్లడించారు. స్వాతం త్య్రం వచ్చిన ఇన్నేండ్లలో అన్ని రంగాల్లో అనతి కాలంలో వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని పునరుద్ఘాటించారు. 38 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేని తేల్చి చెప్పారు. జాతీయ సర్వేలు కూడా బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడతాయని చెప్తున్నాయని అన్నారు. ‘తొమ్మిదిన్నరేండ్లుగా ప్రజలతో ఉన్నాం. వారికి ఏం చేయాలో చేశాం. ఇంకేమి చేయాలో కూడా తెలుసు’ అని చెప్పా రు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.