కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 10 : కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కదనభేరి సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నియమించిన ఇన్చార్జీలు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలమల్లుతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్‌తో కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నదని అన్నారు. ఈ ఎన్నికలకు ఇక్కడి నుంచే శంఖారావం పూరిస్తున్నట్టు తెలిపారు. సభకు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు.