Minister KTR | రాజన్న సిరిసిల్ల : రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాలపల్లిలో క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి.. రైతులను ఓదార్చారు. అధైర్యపడొద్దని, కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అకాల వర్షాలకు రైతులు నష్టపోయారన్నారు.
ఇటీవల సీఎం కేసీఆర్ స్వయంగా పంటలను పరిశీలించి, రైతులకు భరోసానిచ్చారన్నారు. వడగళ్ల వానలు రైతుల నోటోమన్నుకొట్టాయని, పుష్కలంగా నీరుండడంతో సమృద్ధిగా పంట చేతికివచ్చిందన్నారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అన్నారు. గ్రామీణ కష్టాలను తెలిసిన నేత కేసీఆర్ అని, ఇవాళ జలవనరులు పెరిగాయంటే కేసీఆర్ సంకల్పం వల్లే సాధ్యమైందన్నారు. రైతులకు కేసీఆర్ అండగా ఉంటారన్నారు. 19వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరానికి రూ.10వేల నష్ట పరిహారం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రైతులంతా విశ్వాసంతో ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు.
ఇప్పటికే ఏడున్నర లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కర్ణాటక ప్రధాని నరేంద్ర మోదీ ఏ కల్చర్ వద్దని గొంతు చించుకున్నారో.. ఇప్పుడు అదే కల్చర్‌ను అవలంభిస్తున్నారని విమర్శించారు. ప్రధాని కర్ణాటకకే ప్రధానినా? మిగతా రాష్ట్రాల్లో సిలిండర్, పాలు ఎందుకు ఇవ్వరు? అంటూ విమర్శించారు. పిరమైన ప్రధానిని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. అదానీ కొన్న ఎయిర్‌పోర్ట్‌కి జీఎస్టీ లేదు కానీ.. పాలు కొన్న సామాన్యుడికి జీఎస్టీ ఉందంటూ ఆరోపించారు.