హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ‘అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్లపై విచారణకు మేము డిమాండ్ చేస్తే మంత్రి సీతక్క ఎందుకు భయపడుతున్నారు. అక్రమాలు వాస్తవమేనని జంకుతున్నారా? మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ‘చెప్పు’ మాటలు మాట్లాడారు’ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు. ఆరోపణలు చేసింది తామైతే ఏ సంబంధమూ లేని కేసీఆర్‌కు లీగల్ నోటీసులు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. వివరణ ఇచ్చుకోలేక మంత్రి సీతక్క చెప్పు తెగుద్ది అని తూలనాడటం బాధాకరమని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలకు సెల్ఫోన్ల కుంభకోణంలో ఆధారాలను బయటపెట్టారు. 33,310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ.54.19 కోట్లతో కాంట్రాక్ట్ కట్టబెట్టి రూ.24 కోట్లే ఖర్చు చేశారని ఆరోపించారు. మిగతా రూ.30 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని తామడిగితే.. మంత్రి సీతక్క అసహనంతో రగిలిపోయారని ఆరోపించారు. సల్మాన్‌ఖాన్ పక్కన, మిస్‌వరల్డ్ పోటీల సమయంలో ఉన్న వ్యక్తే ఈ సెల్ఫోన్ల కాంట్రాక్ట్‌ను ఇప్పించినట్టు అనుమానం ఉన్నదని చెప్పారు.
మీ సోషల్ మీడియాపై చర్యలేవి ?
అంగన్వాడీలకు 5జీ స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం 4జీ ఫోన్లు అందించి చేతులు దులుపుకొన్నదని మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు 5జీ సెల్ఫోన్లు పంపిణీ చేశామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘సర్కార్‌పై బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని సైబర్‌క్రైమ్‌కు మంత్రి సీతక్క ఫిర్యాదు చేశారు. మరి తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోరా? అంటూ ప్రశ్నించారు. సెల్ఫోన్ల టెండర్లో కేంద్ర నిధులున్నందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని స్పష్టంచేశారు.
‘ఈ కార్’ లో ఇబ్బందులు పెట్టొచ్చా?
‘మంత్రిగా కేటీఆర్ తన హయాంలో ఎలాంటి తప్పు చేయకున్నా ఈ కార్ రేస్ కేసు విషయంలో ఏసీబీ నాలుగుసార్లు, ఈడీ విచారణ, గవర్నర్‌కు ఫిర్యాదులు చేసినా ఏ నాడూ కేటీఆర్ ఒక్కరిని కూడా తూలనాడలేదు కదా సీతక్క’ అని మన్నె క్రిశాంక్ తెలిపారు. తాను మొబైల్ ఫోన్ల కుంభకోణం గురించి అడిగితే.. చెప్పుతో కొడుతానని అనడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఆధారాలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పక్క రాష్ర్టాల్లో 5జీ.. ఇక్కడ 4జీ : సతీశ్
అంగన్వాడీ టీచర్లకు పొరుగురాష్ట్రాల్లో 5జీ ఫోన్లు ఇస్తే.. తెలంగాణలో మాత్రం 4జీ ఫోన్లు ఎందుకు కట్టబెట్టారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ‘సీతక్కా ఓపెన్ చాలెంజ్.. ములుగు, హైదరాబాద్, వరంగల్‌లో ఎక్కడైనా.. ఏ సెల్‌ఫోన్ దుకాణానికైనా వెళ్దాం.. సాంసంగ్ ఏ06 ఫోన్ ధర రూ.11,650 ఉంటే దేనికైనా మేము సిద్ధం’ అని తేల్చిచెప్పారు. ‘నీతులు చెప్తున్న మంత్రి తన ధనదాహానికి ములుగులో నలుగురిని పొట్టనబెట్టుకోలేదా? మేడారం జాతర టెండర్ల కోసం ఇద్దరు మంత్రులు కొట్టుకొన్నది నిజంకాదా? నాసిరకం పనులకు ఆరేండ్ల బాలుడి అంగవైకల్యానికి కారణం మీరు కాదా? వేతనమందక ములుగు పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోలేదా? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీది బాధ్యత కాదా? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ఈ ఘటనలన్నింటికీ ఎన్ని కేసులు పెట్టాలని నిలదీశారు. సెల్ఫోన్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత దినేశ్‌చౌదరి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రెండు పార్టీలు ఒక్కటేననే విషయాన్ని ప్రజలు అర్థంచేసుకొంటారని స్పష్టంచేశారు.