వరంగల్, మార్చి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హనుమకొండ: బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభలో వచ్చే 25 ఏండ్ల తెలంగాణ ప్రగతికి ప్రణాళికగా అంకురార్పణ జరుగుతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ వెల్లడించారు. కొత్త తరానికి కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా ఈ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఒడితల సతీశ్‌కుమార్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కే వాసుదేవరెడ్డితో కలిసి ఆయన శుక్రవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 25 ఏండ్ల క్రితం బీఆర్ఎస్ పుట్టినప్పుడు.. మూణ్నాళ్లకే పోతుందని అప్పటి సీ ఎం చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు వైఎస్సార్ తదితరులు మాట్లాడారని చెప్పారు. సమైక్య పార్టీల విమర్శలు తప్పని రుజువు చేస్తూ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తీరిందని, కొత్త రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిందని స్పష్టంచేశారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ గొప్పగా నిలుస్తుందని చెప్పారు.
ప్రజల పార్టీ బీఆర్ఎస్ : దాస్యం
తెలంగాణ ప్రజల ఇంటిపార్టీ బీఆర్ఎస్ అని హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ తెలిపారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో లక్షలాది మందితో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాంత ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసిన పార్టీ తమదేనని చెప్పారు. ఎ లతుర్తి సభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సభ గొప్ప మలుపు: ఎమ్మెల్సీ పోచంపల్లి
తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని, వచ్చేనెలలో జరిగే పార్టీ రజతోత్సవ మహాసభ తెలంగాణలో రాజకీయంగా గొప్ప మలుపులకు కారణమవుతుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్కు వరంగల్‌తో సెంటిమెంట్ ఉన్నదని, ఇప్పుడు ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగ జరగనున్నదని చెప్పారు.
స్వచ్ఛందంగా భూములిచ్చారు: పెద్ది
ఎలతుర్తి మండల కేంద్రంలో 1,213 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు రైతులు స్వచ్ఛందగా తము భూములు ఇచ్చారని మాజీ ఎ మ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చెప్పారు. భూములు ఇచ్చి సహకరించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ 25 ఏండ్ల సభను ఉమ్మ డి వరంగల్ జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్కతుర్తి సభకు అవసరమైన అన్ని అనుమతులకు దరఖాస్తులు చేసినట్టు తెలిపారు.
గొప్ప నిర్ణయం: మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
బీఆర్ఎస్ 25 ఏండ్ల బహిరంగసభ ఎల్కతుర్తిలో నిర్వహించడం గొప్ప నిర్ణయమని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వీ సతీశ్‌కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేస్తామని ఆయన చెప్పారు.