Padi Kaushik Reddy | హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు చేయించారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ రవీందర్ సింగ్, నారదాసు తెలిపారు. అర్ధరాత్రి దాటాక పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి.. రాత్రంతా హైడ్రామా క్రియేట్ చేశారని నారదాసు ఆరోపించారు. రెండు కేసుల్లో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారని అన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏమైనా మారుస్తారమో చూడాలని అన్నారు.
పాడి కౌశిక్ రెడ్డిపై మొత్తం 5 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ వన్ టౌన్లో మూడు కేసులు, త్రీటౌన్ పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. మొత్తం 12 సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేసినట్లు బీఆర్ఎస్ లీగల్ టీమ్‌కు పోలీసులు చెప్పారు. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదు చేశామని అన్నారు.
కాగా పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీసు స్టేషన్లోనే మంగళవారం ఉదయం ఈ పరీక్షలు పూర్తి చేశారు. కాసేపట్లో ఆయన్ను కరీంనగర్ రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఒక న్యూస్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సోమవారం రాత్రి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే పథకం ప్రకారం ఆ చానల్ గేట్ ముందు మోహరించిన కరీంనగర్ పోలీసులు.. ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డిని చుట్టుముట్టా రు. ఒక వ్యక్తికి సెల్ఫీ ఇస్తున్న సమయంలో దాదాపు నలభై మంది పోలీసులు రౌండప్ చేసి కారణాలు చెప్పకుండానే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అరెస్టును కౌశిక్‌రెడ్డి ప్రతిఘటించగా, బలవంతంగా కారులో ఎక్కించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పండి అంటూ నిలదీయడంతో ‘కరీంనగర్లో నమోదైన కేసు గురించి’ అంటూ అదుపులోకి తీసుకున్నారు. ‘నేను వస్తాను.. ఎందుకు నెడుతున్నారు? నెట్టకు భయ్యా’ అని పాడి కౌశిక్‌రెడ్డి చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అరెస్టుకు సంబంధించిన వారెంట్, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
కౌశిక్‌రెడ్డి వివిధ వేదికలపై నిత్యం ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. గతంలో దళితబంధు విషయంలో హుజూరాబాద్‌లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న కౌశిక్‌రెడ్డిపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించిన తీరు వివాదాస్పదమైంది. పోలీసులు పిడిగుద్దులు గుద్దడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరుచేసిన దళితబంధు రెండో విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలన్నందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించింద నే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అంతకుముందు జడ్పీ సమావేశంలో కూడా ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు ఆయనపై అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ పలు కేసులు నమోదు చేశారు. తాజాగా ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో.. బీఆర్ఎస్ బీఫారంపై గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను నిలదీసిందుకు.. ఆయనపై కక్షకట్టిన మం త్రుల ఆదేశాల మేరకే పోలీసులు అరెస్టు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కోర్టులకు సెలవులు ఉన్న నేపథ్యంలో బెయిల్ రాకుండా చేయొచ్చన్న వ్యూహంలో భాగంగానే కౌశిక్‌రెడ్డిని కుట్రపూరితంగా నిర్బంధంలోకి తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వాస్తవానికి కౌశిక్‌రెడ్డికి 35 ఏ సెక్షన్ కింద నోటీసులు ఇస్తే సరిపోయేదానికి అరెస్టు చేయడం.. బీఆర్ఎస్ నేతలను కుట్రపూరితంగా టార్గెట్ చేయడమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏడేండ్ల కంటే తక్కువగా శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయొద్దని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు వ్యవహారంలో అసలేం జరిగిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తున్న నాలుగు పథకాలపై కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్ పక్కపక్కనే కూర్చున్నారు. సంజయ్ కంటే ముందు కౌశిక్‌రెడ్డిని మాట్లాడాల్సిందిగా అధికారులు కోరారు. ఈ సందర్భంగా కొత్తగా అమల్లోకి తెస్తున్న నాలుగు పథకాల్లో ఉన్న లోపాలను కౌశిక్‌రెడ్డి ఎత్తిచూపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని, ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఇస్తామంటున్నారని, రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధికి ఇస్తున్న ఎస్డీఎఫ్ నిధులను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీలకు కేటాయిస్తున్నారని, తన నియోజకవర్గానికి కేటాయించిన రూ.10 కోట్ల నిధులను తన చేతిలో ఓడిపోయి మూడోస్థానంలో నిలిచిన వ్యక్తి పేరిట ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మంత్రులను నిలదీశారు. అభివృద్ధి పనులకు పైసలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నదా? ప్రభుత్వం ఇస్తున్నదా? అని ప్రశ్నించడంతో మంత్రుల నుంచి ఎలాంటి జవాబు రాలేదు. దళితబంధు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల గురించి ప్రస్తావించిన కౌశిక్‌రెడ్డి.. ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించి కూర్చున్నారు. ఈ సందర్భంలో తన పక్కనే కూర్చున్న డాక్టర్ సంజయ్ తనను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తున్నారని, ఆయనకు మైక్ ఇవ్వవద్దని, ఆయనది ఏ పార్టీ? అంటూ వేదికపై ఉన్న మంత్రులను ప్రశ్నించారు. సంజయ్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీఆర్ఎస్లో ఉన్నారా? అని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు దూషించుకున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా రంగంలోకి దిగిన పోలీసులు కౌశిక్‌రెడ్డిని కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి ఈడ్చుకొని బయటకు తీసుకెళ్లారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులకు సర్దిచెప్పి అక్కడినుంచి కౌశిక్‌రెడ్డిని తీసుకుని వెళ్లిపోయారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన వాదోపవాదాలు, పరస్పర దూషణల నేపథ్యంలో ఆదివారం నుంచి జిల్లాలో హైడ్రామా సాగుతున్నది. సమీక్ష ముగిసిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సంజయ్‌కుమార్ సమాధానం చెప్తూ.. కౌశిక్‌రెడ్డిపై కేసు పెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అదేరోజు సాయం త్రం తన పీఏతో కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య కూడా కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సమీక్షను అడ్డుకున్నారంటూ కరీంనగర్ ఆర్డీవోతోనూ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదుచేసిన పోలీసులు సోమవారం ఉదయం నుంచి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడానికి నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. స్పీకర్‌ను కలిసి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తున్నది. కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేయడం కలకలం రేపుతున్నది. నాటకీయ పరిణామాల మధ్య అరెస్టుల పర్వం సాగినట్టు కనిపిస్తున్నది.