కోదాడ, జనవరి 24 : మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లో నే కోదాడ నియోజకవర్గంలో పోలీసుల గుండా రాజ్యం వర్ధిల్లుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కో దాడలో దళిత బిడ్డ కర్ల రాజేశ్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో కోదాడ ర్యాలీలో ఆయన భావోద్వేగంతో ప్రసంగించారు. రాజేశ్ మృతిచె
ంది 68 రోజులు కావస్తున్నప్పటికీ బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయకపోవడం శోచనీయమని మండిపడ్డారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోలీసుల చిత్రహింసలతోనే రాజేశ్ మరణించాడని ఆధారాలతో నిరూపించినప్పటికీ బాధ్యుడైన చిలుకూరి ఎస్సై సురేశ్రెడ్డిని ఎం దుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు అధికార పార్టీ నాయకులు, అనుచరులు తమపై చేస్తున్న దాడులను పోలీసులు పట్టించుకోకపోయినప్పటికీ ఓపికతో భరించామని.. రాబోయే రోజుల్లో ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్ గాంధీమార్గంలో 14 ఏండ్లు పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారని, తాము కూడా అదే బాటలో పయనిస్తున్నామని చెప్పారు. మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. ర్యాలీలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాకేశ్రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కర్ల రాజేశ్ తల్లి లలితమ్మ, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.