Sampath Kumar | నడిగడ్డ ప్రాంతంలో వసూల్ రాజాలు తిరుగుతున్నారని ఎమ్మెల్యే విజయుడు విమర్శించారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఇసుక దందాను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. దీనికి అడ్డువచ్చిన మండల అధికారులను వెంటవెంటనే బదిలీ చేయిస్తున్నాడని అన్నారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే విజయుడు మీడియాతో మాట్లాడుతూ.. సంపత్ కుమార్ వసూల్ రాజా అవతారం ఎత్తాడని అన్నారు. ఈ వసూల్ రాజా భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు.
నడిగడ్డ ప్రజలను సంపత్ కుమార్ పచ్చి మోసం చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత కిశోర్ విమర్శించారు. నడిగడ్డలో సంపత్ కుమార్ రెండు సార్లు ఓడిపోయాడని తెలిపారు. నడిగడ్డ సంపత్ ఇలాకా కాదని.. అయినా సంపత్కు సుంకాలు కడితేనే ఇక్కడ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాపాలన అంటూ సంపత్ చేస్తున్న దందాలు అన్నీఇన్నీ కావని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా సంపత్ కుమార్ చేతిలోనే ఉన్నాయని ఆరోపించారు. సంపత్ కుమార్ చేయి తడిపితేనే నడిగడ్డలో పనులు జరుగుతాయని అన్నారు. ఆలంపూర్లో ప్రజలను పీడించే పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఆలంపూర్లో సంపత్ కుమార్ అనుచరుల అరాచకాలకు అడ్డుకట్ట వేయలేరా అని మండిపడ్డారు. సంపత్ కుమార్ మీద ప్రతీది ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. సంపత్ కుమార్ మాట్లాడితే నిప్పు అంటాడని.. ఇప్పుడు ఎవరు నిప్పు అని ప్రశ్నించారు. సంపత్ నిప్పా.. పప్పా? అని సెటైర్ వేశారు. సంపత్ కుమార్ అక్రమాలను ఎక్కడికక్కడ ఎండగడతామని తెలిపారు.