భీమ్‌గల్, జూలై 29: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు సోమవారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో రాస్తారోకో చేశారు. దాడి చేసి పది రోజులవుతున్నా ఇసుక మాఫియా సభ్యుల ఆచూకీ దొరకలేదా? అని మండిపడ్డారు. ఇటీవల కప్పలవాగు నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా బీఆర్ఎస్ నేతలు కర్నె మహేందర్ తదితరులు అడ్డుకున్నారు. మహేందర్‌పై ఇసుక మాఫియా కట్టెలు, రాళ్లతో దాడి చేసింది. నిందితులను అరెస్టు చేయకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సై హరిబాబు వచ్చి నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పినా రాస్తారోకో కొనసాగించారు. దీంతో వారిని పోలీసులు తప్పించే క్రమంలో మాజీ ఎంపీపీ మహేశ్ చొక్కా చినిగిపోయింది. ఇసుక మాఫియా సభ్యులను కచ్చితంగా అరెస్టు చేస్తామని ఎస్సై మరోసారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.