హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట అధికారులు ప్రొటోకాల్ పాటించటం లేదని, శాసనసభ్యుల హక్కులను పరిరక్షించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఏ హోదాలో ఆహ్వానిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు, సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
తమ నియోజకవర్గాల్లో అధికారులు యథేచ్ఛగా ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, కల్యాణలక్ష్మి, బోనాల చెక్కులను ఎలాంటి హోదా లేనివాళ్లతో పంపిణీ చేస్తున్నారని, తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వెల్లడించారు. ఇలా అయితే ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను అసెంబ్లీ సమావేశాలకు అనుమతించాలని స్పీకర్‌కు సూచించారు. లేకుంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కు ప్రొటోకాల్ పాటించేలా స్పష్టమైన ఆదేశా లు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా పద్మారావు, సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మాణిక్‌రావు తదితరులు విడివిడిగా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అడిగితే ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాడి కౌశిక్‌రెడ్డిపై కేసులు పెట్టారని తెలిపారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాజీ మంత్రి పద్మారావు మాట్లాడుతూ.. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు అధికారిక ఆహ్వానాలు,ప్రభుత్వ కార్యక్రమా ల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
ఇలాగే ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరిగితే కోర్టులను ఆశ్రయిస్తామని ప్రకటించారు. సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకే ప్రభుత్వ అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యేల హకులను కాపాడాలని తాము స్పీకర్‌ను కోరామని వెల్లడించారు. సర్దుకుపోవాలని ఎమ్మెల్యేకే దేవాదాయ అధికారులు, పోలీసులు చెప్పే పరిస్థితి తన నియోజకవర్గంలో వచ్చిందని..
ఇదేనా ప్రజాపాలన అంటే? అని ప్రశ్నించారు. అలా అయితే, సీఎం రేవంత్‌రెడ్డిపై ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థిని తనపకన కూర్చోబెట్టుకోవాలని అన్నారు. అవసరమైతే చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇష్టానుసారంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. స్పీకర్‌ను కలిసినవారిలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్‌కుమార్, చింత ప్రభాకర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.