హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు శుక్రవారం రాత్రే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మరికొంత మంది నేతలు శనివారం బయల్దేరి వెళ్లనున్నారు. శుక్రవారం రాత్రి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్యయాదవ్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ తదితరులు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శనివారం ఉదయం మరికొంత మంది ముఖ్యనేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. కవిత అరెస్టు నేపథ్యంలో న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు వీరు ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిసింది.
కేసీఆర్‌తో పార్టీ నేతల సమావేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలతో సమావేశంలో ఉన్న కేసీఆర్‌కు తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాల విషయం తెలియగానే మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులు కవిత నివాసానికి వెళ్లారు.