MLC Madhusudhana Chary | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు చార్జీలను పెంచి.. ప్రజలపై భారం మోపవద్దని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. రూ.1200 కోట్ల కోసం ప్రజల నడ్డి విరవడం అవివేకమని అన్నారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణ మండలి నిర్ద్వందంగా తిరస్కరించాలని కోరారు. 2024 -25 నుంచి 2028-29 కాలానికి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ప్రతిపాదించిన ఏఆర్ఆర్, వీలింగ్ చార్జీలు, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీలపై ఈఆర్సీ బుధవారం బహిరంగ విచారణను నిర్వహించింది. ఈ విచారణకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మధుసూదనాచారి, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, తక్కళ్లపల్లి రవీందర్రావు హాజరయ్యారు. విద్యుత్తు సంస్థలను వ్యాపార, లాభాలు గడించే కంపెనీలుగా చూడరాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం అత్యంత దారుణమని మధుసూదనాచారి మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేవిగా విద్యుత్తు సంస్థలను నడపాలని సూచించారు. ఫిక్స్డ్ చార్జీలను రూ.10 నుంచి రూ.50కి పెంచాలనుకోవడం దారుణమని అన్నారు. డిస్కంలు అదనపు ఆదాయం పెంచుకోవడమంటే, ప్రజలపై ఆదనపు భారం మోపడమేనని చెప్పారు. విద్యుత్తు చార్జీలు పెంచితే పారిశ్రామికరంగం కుదేలవుతుందన్నారు. పరిశ్రమలు మూతపడతాయని, ఇతర రాష్ర్టాలకు తరలివెళ్తాయని హెచ్చరించారు. రూ.1200 కోట్లకుపైగా ఆదాయం కోసం ఆర్రులుచాస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే అవుతుందని అన్నారు. ఉదారంగా వ్యవహరించి రూ.1200 కోట్లను ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈఆర్సీ ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. కేసీఆర్ దూరదృష్టిలోతో తెలంగాణ విద్యుత్తు రంగంలో స్వర్ణమయం అయ్యిందని, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7వేల మెగావాట్ల నుంచి 24 వేల మెగావాట్లకు పెరిగిందని గుర్తుచేశారు.
డిస్కంల ప్రతిపాదనలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, ఫిక్స్డ్ ఛార్జీలు అమాంతం పెంచడం దేనికని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్‌రావు ప్రశ్నించారు. ఇది డొంకతిరుగుడు వ్యవహారంలా ఉన్నదని, దీంట్లో హేతుబద్ధతలేదని మండిపడ్డారు. తక్కువ ఖర్చుతో జలవిద్యుత్తును ఉత్పత్తిచేసే అవకాశమున్నా, నిర్లక్ష్యమెందుకుని నిలదీశారు. డిస్కంలకు ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం అందడంలేదని అన్నారు. ప్రభుత్వం రెవెన్యూలోటును తీర్చితే డిస్కంలు ఏఆర్ఎస్ను సమర్పించాల్సిన అవసరమే ఉండదని చెప్పారు.
విద్యుత్తు చార్జీల భారం భరించలేకే పంజాబ్‌లోని అనేక పరిశ్రమలు రాజస్థాన్‌కు తరలివెళ్లాయని, రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితినే కోరుకుంటున్నారా? అని స్పిన్నింగ్ మిల్స్, సౌత్ ఇండియా సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రశ్నించారు. విద్యుత్తు ఉద్యోగుల వేతనాలను 5 నుంచి 7శాతానికి పెంచి, భవిష్యత్తులో పెరిగే వాటిని ఇప్పటినుంచి వసూలు చేసుకోవానుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. సెక్యూరిటీ డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఏఆర్‌ఆర్‌లో పేర్కొనలేదని చెప్పారు. విద్యుత్తు డిమాండ్ పెరుగుతుందని ఇష్టారీతిన పెట్టుబడులు పెట్టడం దారుణమని, ఎలాంటి అధ్యయ నం లేకుండా ఏ ప్రాంతంలో లోడ్ పెరుగుతుందో స్పష్టంచేయకుండా గుడ్డిగా పెట్టుబడులు పెట్టి వినియోగదారులపై భారం మోపడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు.
రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్న నెపంతో విద్యుత్తు అధికారులు రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ప్రతినిధి దోనూరి రాము ఆవేదన వ్యక్తంచేశారు. ఓఆర్సీ పేరుతో కొత్త కనెక్షన్లు ఇవ్వడంలేదని చెప్పారు. విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించరాదని, ప్రైవేటీకరిస్తే రైతులు బతుకలేరని పేర్కొన్నారు. విద్యుత్తు సంస్థలు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని సూచించారు. కంపెనీల నుంచి సీఎస్సార్ నిధులు సమీకరించి, రైతులకు సేవచేయాలని అన్నారు. తద్వారా కంపెనీలు నష్టాలను పూడ్చుకోవచ్చని తెలిపారు.