హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నది. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నది. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న ఈసీ మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటలకు జరిగే సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని అధికారికంగా ఆహ్వానించింది.
ఈసీఐ కార్యదర్శి అశ్వినీకుమార్ మొహల్ అధికారిక లేఖను తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షుడికి అందజేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు నేతృత్వంలో రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కూడిన ప్రతినిధి బృందం వెళ్లనున్నది. ఈ సమావేశంలో ఎన్నికల సంసరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధిత అంశాలపై చర్చించే అవకాశమున్నది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది.