రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువు దోపిడీ చేస్తున్నదని, పండించిన ప్రతి పంటకూ కమీషన్ తీసుకుంటూ.. దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకొందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో రూ.1100 కోట్లు… సీసీఐ పత్తి కొనుగోళ్లలో రూ. 3000 కోట్లు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిచి నష్టాల్లో కూరుకుపోయిన రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్ల కోసం రైతులు కొట్టుకుంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే వరకు బీఆర్ఎస్ నాయకులు రైతుల తరఫున పోరాటం చేస్తారని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలో నాలుగు రోజులుగా గన్నీ సంచుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నది. దస్తురాబాద్ మండలం రేవోజిపేటకు బుధవారం గన్నీ సంచులు రాగా రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. రేవోజిపేటలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి 10 వేలు, గొడిసెర్యాల గొండుగూడెం(జీ)కి 8వేల గన్నీ సంచులు వచ్చినట్టు పీఏసీఎస్ చైర్పర్సన్ రామడుగు శైలజారమేశ్రావు తెలిపారు.
తడిసిన ధాన్యం కొనాలని జగిత్యాల నియోజకవర్గ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాలవర్షానికి ధాన్యం తడవగా, బుధవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్ ఎదుట జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేశారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
ధాన్యం కాంటాలైనా తన బస్తాలను ఎందుకు తరలించరని ఓ రైతు బుధవారం పెట్రోల్ బాటిల్‌తో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర ధాన్యం కొనుగోలు కేంద్రంలో హల్చల్ చేశాడు. సోమ్లా తండాకు చెందిన బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. తనకన్నా వెనుక కాంటాలైన రైతుల బస్తాలను లారీల్లో తరలించి తన బస్తాలను ఆపారని ఆరోపించారు. దీనిపై నిలదీస్తే దొడ్డు ధాన్యాన్ని మాత్రమే లారీ యాజమాన్యాలు, AZమిల్లు వాళ్లు తీసుకెళ్తున్నారని సమాధానం చెప్పారని తెలిపారు. ధాన్యాన్ని తీసుకెళ్లకపోవడంతో మనస్తాపం చెంది పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చినట్టు తెలిపారు. సన్న ధాన్యాన్ని తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు చేరుకొని రైతును సముదాయించి రేపు ధాన్యం బస్తాలను తరలించేలా లారీలను పంపిస్తామని చెప్పడంతో రైతు ఆందోళన విరమించాడు.
ములుగు జిల్లా వాజేడు మండలంలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమపేర్లు రాలేదని, కొందరికే ఎలా ఇస్తారని మంత్రిని నిలదీశారు. మరో విడతలో అందరికీ ఇచ్చేలా చూస్తానని మంత్రి సముదాయించే ప్రయత్నం చేశారు.