మద్దూర్(కొత్తపల్లి), ఫిబ్రవరి 18 : తల్లి వేతనం అడిగాడని కుమారుడిని పోలీసులు చితకబాదిన ఘటన నారాయణపేట జిల్లా, కొత్తపల్లి మండలం అల్లీపూర్లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి మండలం అలీపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ పదేండ్లుగా స్కావెంజర్‌గా పనిచేస్తున్నది. మూడు నెలలుగా తనకు వేతనాలు ఇవ్వడం లేదని తన కుమారుడు ఎల్లప్పకు చెప్పింది. ఎల్లప్ప సోమవారం పాఠశాలకు వెళ్లి హెచ్ఎంను అడుగగా ఆమె స్పందించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రసీదు తెప్పించి ఆమె సంతకం చేసి ఎస్ఎంసీ చైర్‌పర్సన్‌తో సంతకం చేయించుకొమ్మని పంపింది. ఎల్లప్ప ఎస్ఎంసీ చైర్పర్సన్ వెంకటమ్మ వద్దకు వెళ్లి సంతకం చేయమని కోరగా కాంగ్రెస్ లీడర్ రమేశ్‌రెడ్డి చెయ్యొద్దన్నారని పేర్కొంది. దీంతో ఎల్లప్ప ఎస్ఎంసీ చైర్‌పర్సన్‌తో వాగ్వాదానికి దిగాడు.
దీంతో ఆమె రమేశ్‌రెడ్డికి చెప్పగా ఆయన సూచన మేరకు పోలీసులు ఎల్లప్పను మద్దూరు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఎస్సై విజయ్‌కుమార్ తనను విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా కోస్గి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి మళ్లీ కొట్టినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ, ముదిరాజ్ సంఘం నాయకులు మంగళవారం మద్దూరు పోలీస్‌స్టేషన్ ఎదుట బాధితుడితో కలిసి ఆందోళన నిర్వహించారు. భీమమ్మకు చెల్లించాల్సిన వేతనాలు వెంటనే మంజూరు చేయడంతోపాటు ఎల్లప్పను కొట్టిన ఎస్సై విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సై విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా స్కూల్ చైర్పర్సన్ వెంకటమ్మ ఫిర్యాదు చేయగా విచారణకు పోలీస్‌స్టేషన్ పిలిపించి మాట్లాడానని, ఎల్లప్పను కొట్టలేదని వివరించారు.