బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సీసీఎస్ విచారణ కోసం పిలిపించి అరెస్ట్ చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాడనే కక్షతోనే అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్బంధ పాలనతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. నిర్బంధాలు ప్రజాగొంతుకలను అణచివేయలేవని హెచ్చరించారు.
ప్రశ్నించేవారిని ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సోషల్ మీడియాలో నిలదీస్తే కక్ష సాధిస్తున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిదికాదని హితవు పలికారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్ దిలీప్ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని చెప్పారు.
ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కడమే ఇందిరమ్మ పాలనా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. నిరసనలు తెలుపుకొనేందుకు అవకాశమిస్తామని చెప్పి అక్రమ అరెస్ట్‌లకు పూనుకుంటున్నదని, ఓ కేసులో విచారణకు పిలిచి బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్ దిలీప్‌ను దుర్మార్గంగా నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఉద్యమకారులకు అరెస్ట్‌లు కొత్తకాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు.
సోషల్ మీడియాను చూసి రేవంత్ సర్కారు వణికిపోతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆరు గ్యారెంటీల హామీలు అమలు చేతగాకే ఉద్యమకారులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని మండిపడ్డారు. కొణతం దిలీప్‌ను విచారణ పేరిట పిలిచి అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని తెలిపారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖండించారు. విచారణ పేరిట పదే పదే అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు ఏడాది కాలంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం ఇంకా ఎంతకాలం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సైబర్‌క్రైమ్ ఠాణాకు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు. రేవంత్‌రెడ్డి రాక్షస పాలన చేస్తున్నారని మండిపడ్డారు. సర్కారుకు ఊడిగం చేస్తూ ప్రజాగొంతులను అణచివేస్తున్న పోలీసులకు భవిష్యత్‌లో శిక్ష తప్పదని హెచ్చరించారు.
పాలన చేతగాక, ఇచ్చిన హామీలు అమలు చేయలేకే రేవంత్ సర్కారు ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కొణతం దిలీప్‌పై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి భయబ్రాంతులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ఆయన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని హితవుపలికారు.
తప్పులు ఎత్తిచూపినందుకే రేవంత్ సర్కారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కక్ష సాధింపునకు దిగుతున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. పదకొండు నెలల్లో వందకు పైగా అక్రమ కేసులు పెట్టింటిందని గుర్తు చేశారు. విచారణకు వెళ్లిన దిలీప్‌ను అదుపులోకి తీసుకోవడం దుర్మార్గంమని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడబోమని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించి, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయనను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్‌లతో ప్రశ్నించే వారి గొంతు నొక్కాలనుకోవడం అమానుషమని, సర్కారు దుర్మార్గపు
చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్ట్ చేయడం అక్రమం..అప్రజాస్వామికమని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ప్రభుత్వాలు విమర్శలను సానుకూలంగా తీసుకోవాలని, అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుందని చెప్పారు. విమర్శలను సహించలేని వారు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్డలేరని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుడు దిలీప్ అరెస్ట్ అన్యాయం. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇది ప్రజాపాలనా కాదని, దుర్మార్గపు పాలన అని విమర్శించారు.
బీఆర్ఎస్కు కేసులు, నిర్బంధాలు కొత్తకాదని టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్ తెలిపారు. తెలంగాణ కోసం అనేకసార్లు జైలుకు వెళ్లిన విషయాన్నిన గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నదని ఆరోపించారు. విచారణ కోసం రమ్మని కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ దోపిడీ పాలనను అంతం చేసేదాకా పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు.