హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది. పారిశ్రామిక భూముల అమ్మకంపై కౌన్సిల్ వేదికగా బీఆర్ఎస్ నిరసన వ్యక్తంచేసింది. పారిశ్రామిక భూములను అమ్మేలా రూపొందించిన పాలసీని రద్దు చేయాలని మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. రూ.5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ రేవంత్‌రెడ్డి సర్కారు దేశంలోనే అతిపెద్ద స్కామ్‌కు తెరలేపిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పారిశ్రామిక కారిడార్ భూములను అమ్ముతున్న హిల్ట్ పాలసీని రద్దు చేయాలని నినదించారు.
ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన భూములను భూ దందా చేయడం ఏమిటని నిలదీశారు. వెంటనే కౌన్సిల్ సమావేశంలో జీవో నం.27ను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని, దీనిపై చర్చ జరగాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మేయర్ సభను రెండు సార్లు మేయర్ వాయిదా వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేక్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నం 27ను రద్దు చేయాలని ఎక్స్అఫీషియో సభ్యులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేక్, సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్లు ఆవుల రవీందర్‌రెడ్డి, సునీత, సామల హేమ, మన్నె కవితారెడ్డి పట్టుబట్టారు. దీంతో సభ్యుల సీట్ల వద్దకు వచ్చిన మార్షల్స్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు సభ్యుల నుంచి ప్లకార్డులను లాక్కున్నారు.
ఈ క్రమంలో మార్షల్స్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ భూములపై చర్చ జరగకుండానే సభను కొనసాగించారు. అనంతరం మేయర్ ప్రసంగించిన తర్వాత సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇటీవలి కాలంలో మృతిచెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రముఖ కవి అందెశ్రీ, ఎంఐఎం కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్‌కు కౌన్సిల్ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. వందేమాతరం గేయం 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ గేయాన్ని ఆలపించాలని పాలకవర్గ సభ్యులు నిర్ణయించడంతో ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం పాడితేనే దేశంలో ఉండాలని కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు చెప్పడంతో ఎంఐఎం సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు సమావేశంలో కార్పొరేటర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే మమ అనిపించి ముగించేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కేలా మేయర్ వ్యవహరించారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార కాంగ్రెస్‌పార్టీ.. ఇతర పార్టీల కార్పొరేటర్లను ప్రలోభపెట్టేందుకు తెరతీసింది. ఏకంగా కార్పొరేటర్లనే కొనేందుకు స్కెచ్ వేసింది. డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. అందులో రూ.కోటి కార్పొరేటర్ ప్రతిపాదించిన పనులకు, మరో రూ.కోటి జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతితో కార్పొరేటర్ సూచించిన పనులకు కేటాయించనున్నారు. అన్ని దశలు దాటుకుని నిధులు డివిజన్‌కు చేరేసరికి మళ్లీ ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేటర్లను ప్రలోభ పెట్టేందుకే నిధుల డ్రామా ఆడుతున్నదని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఆరోపించారు.
ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రభుత్వ ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే విలీనాన్ని ఏ ప్రాతిపదికన చేపడుతారనే చర్చ జరగకుండా ఆగమేఘాల మీద టేబుల్ ఐటమ్‌లో చేర్చి ఆమోదించారు. రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం పొందిన వెంటనే కౌన్సిల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. ఇవేమీ పట్టించుకోకుండానే రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.