హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు (BC Reservations) చేపట్టిన రాష్ట్ర బంద్ (BC Bandh) కొనసాగుతున్నది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో చేపట్టిన ఈ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ (BRS) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలు పల్లె రవికుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, అంజనేయులు గౌడ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, తుల ఉమ, రాజయ్య యాదవ్ తదితర నేతలు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు ర్యాలీగా వెళ్లి రహదారిపై బైఠాయించారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్, మన్నె గోవర్ధన్‌రెడ్డి తదిరత నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు తెలంగాణ భవన్ వద్ద మాజీ మంత్రి గుంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీలు మొక్కుబడిగా భాగస్వామ్యం కావొద్దన్నారు. రాజ్యంగ సవదరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా తగ్గడానికి వీళ్లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతున్నదని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై ఆ పార్టీ వైఖరి బట్టబయలైందని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందని ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారని చెప్పారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణమన్నారు. చెల్లెని జీవోలు, ఆర్డినెన్సులను విడుదల చేశారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించే నాథుడే కరువయ్యాడని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ బూటకమని చెప్పారు.