హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతల అరెస్టులపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి హరీశ్‌రావును, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లిన గచ్చిబౌలి, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఒంటేరు ప్రతాపరెడ్డి నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. హరీశ్‌రావును, కౌశిక్‌రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. మధ్యాహ్నం ఆందోళన చేసిన 30 మందిని అరెస్టుచేసి కొల్లూర్ స్టేషన్‌కు తరలించగా, సాయంత్రం బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీచార్జీతో చెదరగొట్టి అరెస్టుచేశారు. గచ్చిబౌలి స్టేషన్ నుంచి పల్లా, ఒంటేరు ప్రతాపరెడ్డిని నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంజారాహిల్స్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యేలు, నేతలు పరామర్శించారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్‌తోపాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల శ్రీధర్‌రెడ్డి తదితరులు బం జారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు తెలుసుకున్నారు. వారిని లోనికి రానివ్వకుండా గేట్లు మూసి ఉంచడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కాసేపటి తర్వాత లో నికి అనుమతించారు. అయితే కోర్టు సమ యం మించిపోయినా కౌశిక్‌రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టకపోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బంజారాహిల్స్ స్టేషన్లో ధర్నాకు దిగారు. తక్షణం ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈక్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలకు సర్దిచెప్పారు.