హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ‘ఏ బేసిన్ ఎక్కడున్నదో కనీస అవగాహన లేని రేవంత్‌రెడ్డికి.. అపర భగీరథుడు కేసీఆర్‌తో పోలికా? రైతులకు ఏం సాధించి పెట్టారని రైతు విజయోత్సవ సభ నిర్వహించారు. 18 నెలల పాలనా కాలంలో 512 మంది రైతులు చనిపోయినందుకా? రైతు భరోసాను ఎగ్గొట్టినందుకా?’ అని మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో బుధవారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు.
ఎడారిగా ఉత్తర తెలంగాణ: గంగుల
కాళేశ్వరం జలాలతో నాడు సస్యశ్యామలంగా మారిన ఉత్తర తెలంగాణ ప్రాంతం.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఇప్పుడు ఎడారిగా మారుతున్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. 12 టీఎంసీలు ఉండాల్సిన ఎల్ఎండీలో ఇప్పుడు 2 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని వాపోయారు. కేసీఆర్ హయాంలోనే కరీంనగర్ పట్టణానికి నిత్యం తాగునీటి సరఫరా జరగగా, ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి నీళ్లు పంపుతూ.. తెలంగాణను ఎండపెడుతున్నారని మండిపడ్డారు. తమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామన్న పనులు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించారు. బడే భాయ్ దగ్గరకు వెళ్లి రేవంత్‌రెడ్డి తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు అనుమతి తీసుకురావాలని, ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అబద్ధాల బురద: వేముల
వరదను తట్టుకోవచ్చు కానీ.. రేవంత్‌రెడ్డి నోటి నుంచి వచ్చే అబద్ధాల బురదను భరించడం కష్టమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎం సీటులో ఉండి మూర్ఖంగా మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులను నమ్మించి నిండా మోసగించి రైతు సంబురాల నాటకంతో కేసీఆర్, హరీశ్‌రావుపై బురద మాటలు మాట్లాడి రేవంత్ తన కుసంసారాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని ఫైరయ్యారు. రేవంత్‌రెడ్డి ఎం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రైతును రాజును చేయాలన్న ఉద్దేశంతో రైతుకు పంట పెట్టుబడి సహాయం అందించాలని రైతుబంధు పథకాన్ని ప్రారంభించిందే కేసీఆర్ అని, అది లేకపోతే రైతు భరోసా ఎకడిదని నిలదీశారు. 11 విడతలుగా రైతుల ఖాతాల్లోకి 80,000 కోట్లకుపైగా రైతుబంధు ద్వారా నాడు పంట పెట్టుబడి సహాయం అందించిన కేసీఆర్.. అప్పట్లో ఏనాడూ ఇంత హంగామా చేయలేదని ఆయన గుర్తుచేశారు.
దండుగమారి సర్కార్: నిరంజన్‌రెడ్డి
రైతు సంబురాలు చేయాలా? వద్దా అనేది దండుగమారి ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. 512 మంది రైతులు చనిపోయినందుకు సంబురాలా? రైతు భరోసా, బోనస్, రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబురాలా? అని నిలదీశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు గుట్టలకు, రాళ్లకు రైతుబంధు ఇచ్చారని ప్రచారం చేశారని, మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకే రైతుభరోసా వేశారని గుర్తుచేశారు. అబద్ధాలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల తర్వాత రైతుభరోసా తప్పకుండా అమలు చేస్తామని, ఇది ఎన్నికల స్టంట్ కాదని సీఎం రేవంత్, మంత్రి తుమ్మల స్పష్టం చేయాలని డిమాండ్‌చేశారు. ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని ఎత్తేస్తారని తమకు విశ్వసనీయ సమాచారం ఉన్నట్టు చెప్పారు.