హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): అహింసామార్గంలో చాలా దేశాలు స్వాతంత్య్రం సాధించుకోవడానికి మార్గం చూపిన మన జాతిపిత స్ఫూర్తి ప్రదాత అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో గురువారం మహాత్మాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మహాత్ముడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, నివాళులర్పించారు. దేశానికి మహాత్ముడు అందించిన సేవలను స్మరించుకున్నారు.
బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీ జీ దేశాన్ని ఏకం చేసి అహింసామార్గంలోనే స్వాతంత్య్రం సాధించిపెట్టారని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి తెలిపారు. గాంధీజీ అహింసామార్గాన్ని స్ఫూ ర్తిగా తీసుకొని కేసీఆర్ తెలంగాణను సాధించారని గుర్తుచేశారు. పదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చారని చెప్పారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఏ ఒక్క హామీని నెరవేర్చక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
గాంధీజీ ఆత్మ కాంగ్రెస్ నేతలను ఆవహించి వారికి సత్బుద్ధిని ప్రసాదించాలని కోరారు. దేశ స్వాతం త్య్ర పోరాటంలో పాల్గొనని వారిని గొప్పగా చిత్రీకరించేందు ఓ వర్గం యత్నిస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు.కార్యక్రమంలో మాజీ మంత్రు లు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, జోగు రామ న్న, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, నాయకులు దేవీప్రసాద్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, రాజవరప్రసాద్, కిశోర్‌గౌడ్, సుమిత్రా, కలీం, మారయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం, అహింస అనేవి మహాత్మాగాంధీ మన అందరికీ అందించిన శక్తివంతమైన రెండు గొప్ప ఆదర్శాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తరతరాలుగా భారతీయులను, ప్రపంచవ్యాప్తంగా బాపూజీని అనుసరించేవారిని ప్రేరేపిస్తూనే ఉన్నాయని తెలిపారు. ‘గాంధీజీ వర్ధంతి సందర్భంగా, మహాత్ముడి సిద్ధాంతాలను అనుసరించేందుకు మనంతట మనం అంకితమవుదాం. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుదాం. సత్యమేవ జయతే’ అని గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఆయనకు నివాళులర్పించారు. ‘గాంధీచూపిన సత్యం, అహింస, మానవ సేవ అనే ఆదర్శాలు తరతరాలకూ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. బాపూ వారసత్వాన్ని గౌరవిస్తూ, ఆయన విలువలను అనుసరించి శాంతి, సౌభ్రాతృత్వం, న్యాయం కోసం కృషి చేద్దాం’ అని ఎక్స్ వేదిగా హరీశ్‌రావు పిలుపునిచ్చారు.