హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంపదను కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎఫ్త్రీ ఫార్ములాను అనుసరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్, పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్.. ఈ మూడు ఎఫ్‌లకు మేలు చేయడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి పాలన సాగుతున్నదని మండిపడ్డారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టిపోసిన మేఘా కంపెనీకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పగించడం, తన సోదరుడు జగదీశ్‌రెడ్డికి స్వచ్ఛబయో, అదానీకి కాంట్రాక్టులు ఇవ్వడం ఇలా రేవంత్ తన 11 నెలల పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆశ్రిత పక్షపాతంపై మాట్లాడే రాహుల్‌గాంధీ రేవంత్‌రెడ్డి కొల్లగొడుతున్న సంపదపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్లో వారు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో 9 నెలలుగా రైతులు ఆందోళన చేస్తుంటే వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
అల్లుడి బండారం బయటపెట్టిన కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టార్గెట్ చేశారని క్రిశాంక్, విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌కు కేసీఆర్, కేటీఆర్ ఫోబియా పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. కొడంగల్ అసలు కుట్రదారుడు సీఎం రేవంత్‌రెడ్డేనని, కేటీఆర్ ఎంతమాత్రమూ కాదని పేర్కొన్నారు. కొడంగల్‌లో జరుగుతున్న దుర్మార్గం బయటి ప్రపంచానికి తెలియకూడదని ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని విమర్శించారు. రేవంత్ సర్కార్ చేస్తున్న అక్రమాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నందు వల్లే కేటీఆర్‌ను కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలని టార్గెట్ చేశారని ఆరోపించారు. పట్నం నరేందర్‌రెడ్డి అఫిడవిట్ అందుకు నిదర్శనమని తెలిపారు. రేవంత్ తన అల్లుడి కోసం రైతుల భూములను కాజేస్తున్నారని కేటీఆర్ ఆధారాలతో బయటపెట్టారని, అందుకు ప్రతీకారంగా కేటీఆర్‌ను కేసులో ఇరికించాలని పథకం వేశారని, అసలు కుట్రదారు రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. సీఎం సోదరుడు అన్న కారణంగా తిరుపతిరెడ్డికి కలెక్టర్ స్వాగతం పలికారని, రైతుల పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యేను మాత్రం జైలుకు పంపారని అన్నారు.
స్వచ్ఛ్‌బయో, అమృత్టెండర్ల అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేకే కేటీఆర్‌పై కుట్ర చేశారని క్రిశాంక్, విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్లో రేవంత్‌రెడ్డి అల్లుడు గొలుగూరి సత్యనారాయణరెడ్డికి చెందిన మ్యాక్స్‌బీన్ ఫార్మా కంపెనీ ఉందని ఆధారాలతో కేటీఆర్ వెల్లడించారని పేర్కొన్నారు. మ్యాక్స్‌బీన్ ఫార్మా కంపెనీ, అన్నం శరత్‌కు చెందిన ఎస్వీఎస్ ఫెసిలిటీ కంపెనీల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయని వివరించారు. సత్యనారాయణరెడ్డికి మ్యాక్స్‌బీన్ ఫార్మాలో వాటా ఉన్నదని, 2020లో ఏర్పాటైన ఈ కంపెనీలో సత్యనారాయణరెడ్డికి 16.06 శాతం వాటా (16.92 లక్షల షేర్లు) ఉన్నదని, మ్యాక్స్‌బీన్ ఫార్మాలో అన్నం శరత్‌కు 1.03 శాతం వాటా (1.08 లక్షల షేర్లు) ఉందని పేర్కొన్నారు. అలాగే, ఎస్వీఎస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కూడా అన్నం శరత్దేనని, మ్యాక్స్‌బీన్ ఫార్మాలో దీనికి 20,33,333 షేర్లు, 19.3 శాతం వాటా ఉన్నదని వివరించారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో శరత్‌కు 5,08,808 షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు.
అల్లుడి కంపెనీ బాగోతాన్ని బయటపెట్టిన కేటీఆర్‌పై కొండగల్ ఉదంతాన్ని రుద్దేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వారు మండిపడ్డారు. కొడంగల్ రైతుల మీద జరిగిన దమనకాండ జాతీయస్థాయిలో చర్చనీయాంశం కావడంతో కేటీఆర్ కుట్ర చేశారంటూ డైవర్షన్ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. అమృత్ పథకం, శోధ, రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, సుంకిశాల మేఘా కంపెనీ బాగోతం, మూసీ బాధితులు, రైతులను మోసం చేయడం వంటి అనేక అంశాలపై రేవంత్ సర్కార్‌ను కేటీఆర్ నిద్రపోనివ్వకుండా చేస్తున్నారని, కుట్రకు ఇదే అసలు కారణమని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేస్‌లో ఏం జరిగిందో స్వయంగా కేటీఆరే వెల్లడించడంతో ఏం చేయలో తోచక కొడంగల్ కుట్ర నాటకాన్ని రక్తికట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ఆఖరికి జైలులో వేసినా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.