పూడూరు, నవంబర్ 12: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై రైతుల దాడి ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి వైఖరే కారణమని, ఈ ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. లగచర్ల రైతులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, కే మహేశ్‌రెడ్డితో కలిసి వారు వెళ్తుండగా చన్గోముల పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను బజారు పాలుచేసే దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫార్మా కంపెనీకి తమ భూములు ఇవ్వబోమని దీర్ఘకాలంగా రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంటే, ముఖ్యమంత్రి వారితో మాట్లాడే స్థితిలోనే లేడని మండిపడ్డారు. గతంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకోసం బీఆర్ఎస్ సర్కారు హయాంలో వేలాది ఎకరాల భూమిని సిద్ధంగా ఉంచిందని వివరించారు.
బీఆర్ఎస్ దాడులను ప్రోత్సహించదు
ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారని మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ సాధించి పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ అధికారులపై దాడులను ఏనాడూ ప్రోత్సహించలేదని తెలిపారు. లగచెర్లలో పేద రైతులు దశాబ్దాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని చెప్పారు. రైతులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునే సమయం రేవంత్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికి పార్టీ కార్యకర్తలు ఫోన్ చేస్తే వారిపైనా కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రైతులు తమ భూముల కోసం కొట్లాడితే ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం ఏమిటని నిలిదీశారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్.. కొలిమిలా మారితే ఆయన ఢిల్లీ, మహారాష్ట్ర యాత్రలు చేస్తున్నాడని విమర్శించారు. రైతులను పరామర్శించేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని, అన్యాయంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుతో రైతులకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని, అధికారులపై ప్రజలను రెచ్చగొట్టే వైఖరి ఏనాడూ తీసుకోదని తేల్చి చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డి, శుభప్రద్ పటేల్, మాజీ ఎంపీపీ మల్లేశం, మండల నాయకులు సీహెచ్ నర్సింహ, వినోద్‌గౌడ్, దయాగౌడ్, జావీద్, రవీందర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.